Railway stations: ఏడాదవుతున్నా అంతే..!
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:46 PM
Railway upgrades జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ రెండు స్టేషన్లను ‘అమృత్ భారత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆశించినస్థాయిలో అభివృద్ధి లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నత్తనడకన ఇచ్ఛాపురం, పలాస రైల్వేస్టేషన్ల అభివృద్ధి
పది శాతం కూడా జరగని ‘అమృత్ భారత్’ పనులు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
అమృత్ భారత్ పథకం కింద ఆ రైల్వేస్టేషన్లను ఎంపిక చేయడంతో ప్రయాణికులు ఎంతో ఆనందపడ్డారు. సౌకర్యాలు మెరుగుపడతాయని, ప్రధాన రైళ్లకు హాల్ట్‌లు కల్పిస్తారని, స్టేషన్ల స్వరూపం మారిపోతుందని ఆశపడ్డారు. ఈ పనులకు గత ఏడాది ఫిబ్రవరి 26న వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. కానీ.. ఏడాదవుతున్నా అభివృద్ధి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు పది శాతం కూడా పనులు జరగలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ ఇచ్ఛాపురం, పలాస రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద చేపడుతున్న పనుల తీరు.
......................
పలాస/ఇచ్ఛాపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ రెండు స్టేషన్లను ‘అమృత్ భారత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆశించినస్థాయిలో అభివృద్ధి లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకు అధిక ఆదాయం వస్తున్న స్టేషన్లలో పలాస రైల్వే స్టేషన్ ఒకటి. ప్రతిరోజూ ఈ స్టేషన్ నుంచి ఏడువేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, రైల్వే అధికారుల ఉదాసీనత కారణంగా ఈ స్టేషన్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం రూ.24.50 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు గతేడాది 26న ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కాగా.. ఇప్పటివరకూ పది శాతం పనులు కూడా జరగలేదు. టిక్కెట్ కార్యాలయానికి అనుసంధానంగా ఒక ప్లాట్‌ఫారం నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రతిపాదనే లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులు తమ వాహనాలు నిలుపుకొనేందుకు పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు పెట్టుకొని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 2018లో తితలీ తుఫాన్ దెబ్బకు ఈ రైల్వేస్టేషన్ ధ్వంస మైంది. దీంతో రూ.5కోట్లతో రైల్వేస్టేషన్ మేనేజర్ గది, ప్రయాణికులు వేచిఉండే గది, అధికారుల కార్యాలయాలను నిర్మించారు. ఆ తరువాత ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. మొత్తం నాలుగు ఫ్లాట్‌ఫారాలు ఉండే పలాస రైల్వే స్టేషన్‌లో ఒక్క దానికి కూడా మరుగుదొడ్లు లేవు. గతంలో ఉన్న మరుదొడ్లను అభివృద్ధి పేరిట తొలగించారు. ఇంతవరకు వాటిని తిరిగి నిర్మించలేదు. ప్రతి రోజూ 7వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే స్టేషన్‌లో మరుగుదొడ్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కల్పించుకొని పలాస స్టేషన్ అభివృద్ధిపై రైల్వేశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎక్కడి వేసిన గొంగళి అక్కడే..
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో పలు సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఒకపక్క మెరుగైన సౌకర్యాలు లేక.. మరోపక్క ప్రధాన రైళ్లు ఆగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.17.98 కోట్లు మంజూరు చేసింది రైల్వేశాఖ. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. అయితే ఏడాది అవుతున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా పనులు ఉన్నాయి. అమృత్‌భారత్ నిధులతో స్టేషన్ ముందు భాగాన్ని ఆధునికీకరించాలి. ప్రయాణికులకు నీడనిచ్చేందుకు వీలుగా ప్లాట్‌ఫారంపై నిర్మాణాలు చేపట్టాలి. మరుగుదొడ్లు, ప్రయాణికుల వాహనాలు పార్కింగ్ చేసే విధంగా స్థలాల అభివృద్ధి, సాధారణ, ప్రత్యేక తరగతుల ప్రయాణికులు వేచి ఉండేందుకు వెయిటింగ్ గదులు వంటివి నిర్మించాల్సి ఉంది. కాగా ఒక్క నిర్మాణం కూడా పూర్తికాకపోవడంపై ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. స్టేషన్‌కు కూత వేటు దూరంలో రెండు అండర్ పాసేజ్‌లు నిర్మించాలి ఉంది. వాటికి సైతం అతీగతీ లేదు. పూరీ-అహ్మదాబాద్, హౌరా-యశ్వంత్‌పూర్ వంటి చాలా రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేదు. దీంతో ప్రయాణికులు 50 కిలోమీటర్ల దూరంలోని పలాస రైల్వేస్టేషన్‌పై ఆధారపడుతున్నారు. లేదంటే 30 కిలోమీటర్ల దూరంలోని బరంపూర్(ఒడిశా) వెళ్లాల్సి వస్తోంది. పొరుగున ఉన్న బరంపూర్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇక్కడి స్టేషన్ మాత్రం అలానే ఉండి పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రైల్వేస్టేషన్ అభివృద్ధికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పనుల తీరు బాధాకరం..
అమృత్ భారత్ పథకం కింద ఇచ్ఛాపురం స్టేషన్‌ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషించాం. కానీ, పనుల తీరు చూస్తుంటే బాధేస్తోంది. ఏడాదిలో కనీసం ఒక నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేకపోయారు. పనులు పూర్తయితే కానీ కొత్త రైళ్ల నిలుపుదల జరగదు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించాలి.
- కె.యోగేశ్వరరావు, ఇచ్ఛాపురం
.................
రైళ్లకు హాల్టులు ఇవ్వాలి
ఇచ్ఛాపురం స్టేషన్‌లో ప్రధాన రైళ్లను నిలుపుదల చేయడం లేదు. పూరి-అహ్మదాబాద్, హౌరా-యశ్వంత్‌పూర్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని దశాబ్దాలుగా కోరుతున్నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించడం లేదు. వాటితో పాటు ప్రధాన రైళ్లు నిలిపితే వేలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంలో రైల్వే శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి.
- కట్టా సూర్యప్రకాష్, డీఆర్‌యూసీసీ మెంబర్ ఖుర్దా డివిజన్, ఇచ్ఛాపురం