Share News

ఎన్నాళ్లీ ఎదురుచూపు

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:53 PM

Allotment Delay మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములిచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ కేటాయింపులో జాప్యం నెలకొంది. నౌపడా మూడురోడ్లు కూడలి సమీపంలో కస్పా నౌపడా ప్రాంతంలో 55 ఎకరాల స్థలాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు గుర్తించారు.

ఎన్నాళ్లీ ఎదురుచూపు
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించే ప్రాంతం ఇదే

  • ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ కేటాయింపులో జాప్యం

  • పెరుగుతున్న పీడీఎఫ్‌ల సంఖ్య

  • మూలపేట పోర్టు నిర్వాసితులకు తప్పని నిరీక్షణ

  • టెక్కలి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములిచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ కేటాయింపులో జాప్యం నెలకొంది. నౌపడా మూడురోడ్లు కూడలి సమీపంలో కస్పా నౌపడా ప్రాంతంలో 55 ఎకరాల స్థలాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇది లోతట్టు ప్రాంతమని, వరదలు, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం ముంపునకు గురవుతుందని, నిర్వాసితుల కాలనీకి అవస్థలు తప్పవని అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ మారిటెం బోర్డు అధికారులు ఆ ప్రాంతంలో మట్టిని వేసి దానిపై కంకర వేసి రోడ్డుకు సమానంగా ఎత్తు చేశారు. అయినా నిర్వాసితులు మాత్రం ముంపు సమయంలో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

  • ఇదిలా ఉండగా ఈ 55 ఎకరాల స్థలంలో 594 పీడీఎఫ్‌(ప్రాజెక్ట్‌ డిస్‌ప్లేస్‌ ఫ్యామిలీ)లకు సరిపడా లేఅవుట్స్‌ సిద్ధం చేసి లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉండగా.. రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి రూ.34. 98కోట్లు నిధులు కేటాయించారు. వీటితో నిర్వాసితులకు ప్లాట్లుతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, కాలువలు, తాగునీరు, పాఠశాల, దేవాలయం, సామాజిక భవనం, పార్కు తదితర సౌకర్యాలు ఏర్పాటుకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో స్థలం కేటాయించాల్సి ఉంది. గతంలో గుర్తించిన పీడీఎఫ్‌ల కన్నా అదనంగా పదుల సంఖ్యలో పీడీఎఫ్‌లు పెరుగుతుండడంతో నిర్వాసితులకు స్థలాల కేటాయింపులో జాప్యమవుతోంది. అధికారులు స్పందించి స్థలాలు కేటాయించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈ విషయమై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వద్ద ప్రస్తావించగా.. వారం రోజుల్లో మూలపేట పోర్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నిర్వాసితులకు పీడీఎఫ్‌లు అందజేశామన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:53 PM