Share News

Turtles: మృత్యు ‘వల’యంలో.. తాబేళ్లు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 AM

Turtle conservation జిల్లాలోని తీరప్రాంతంలో పెద్ద ఎత్తున తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తుండడం.. సముద్రంలో నీరు కలుషితమవుతుండడం.. తాబేళ్ల పాలిట శాపమవుతోంది. ఒక్క జనవరి నెలలోనే జిల్లాలో 363 తాబేళ్లు చనిపోయినట్టు ఒక అధ్యయనంలో తేలింది.

Turtles: మృత్యు ‘వల’యంలో.. తాబేళ్లు
దోనిపేట తీరంలో తాబేళ్ల కళేబరాలు

  • జిల్లాలో గత నెలలో 363 మృతి

  • ఇక సముద్రంలోకి కొట్టుకుపోయినవి ఎన్నో..

  • ఓ సంస్థ అధ్యయనంలో సంచలన నిజాలు

  • నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట కారణం

  • రణస్థలం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తీరప్రాంతంలో పెద్ద ఎత్తున తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తుండడం.. సముద్రంలో నీరు కలుషితమవుతుండడం.. తాబేళ్ల పాలిట శాపమవుతోంది. ఒక్క జనవరి నెలలోనే జిల్లాలో 363 తాబేళ్లు చనిపోయినట్టు ఒక అధ్యయనంలో తేలింది. చెన్నైకి చెందిన ట్రీ ఫౌండేషన్‌ అనే సంస్థ.. తాబేళ్ల పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఇటీవల మత్స్యశాఖ, మెరైన్‌ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సహకారంతో జనవరిలో తీరంలో తాబేళ్ల మృతిపై సర్వే చేసింది. మన రాష్ట్రంలో 3,085 తాబేళ్లు చనిపోగా.. అందులో జిల్లాకు సంబంధించి 363 ఉన్నట్టు గుర్తించింది. వాస్తవానికి ఈ కాలంలో తీరంలో తాబేళ్లు మృతిచెందడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది మాత్రం అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

  • ఉత్పత్తికి అనువైన ప్రాంతం..

  • జిల్లాలో 193 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ తీరం విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో తీర ప్రాంతం ఉంది. విశాలమైన ప్రదేశం, ఎత్తైన ఇసుక తిన్నెలు ఉంటాయి. ఒడిశా తర్వాత తాబేళ్ల సంతతికి మన తీరం అనువైన ప్రాంతం. సాధారణంగా సముద్ర జలాల అడుగున తాబేళ్లు ఉంటాయి. ప్రతి 40 నిమిషాలకు ఒకసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలంపైకి వస్తాయి. అలాగే ఏటా నవంబరు నుంచి మార్చి వరకూ అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య తీరం వైపు వస్తుంటాయి. తీరానికి సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ఇసుక దిబ్బల్లో బొరియలు చేసి గుడ్లు పెడుతుంటాయి. అటువంటి సమయంలోనే బోట్లు, వలలకు తాకి .. ఇతర కారణాలతో మృత్యువాత పడుతున్నాయి. స్థానిక మత్స్యకారులు ఏటా వందలాది తాబేళ్ల కళేబరాలను కప్పిపెడుతుండడం విచారకరం.

  • కానరాని నిబంధనలు

    నిబంధనలకు విరుద్ధంగా చేపలవేట తాబేళ్ల పాలిట శాపమవుతోంది. తీరానికి సమీపం నుంచే చేపలు వేటాడే మెక్‌నైజ్డ్‌ బోట్లు, నిషేధిత వలలు వీటి పాలిట యమపాశాలుగా మిగులుతున్నాయి. పెద్ద ఇంజన్‌ బోట్లతో తీరానికి 8 కిలోమీటర్ల తరువాతే వేట సాగించాలన్న నిబంధన ఉంది. కానీ చాలామంది ఈ నిబంధనను పాటించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో ఉపరితలానికి వస్తున్న తాబేళ్లకు ఇంజన్‌ తగిలి మృత్యువాత చెందుతున్నాయి. అలాగే నదులు, ఏరుల నుంచి సముద్రంలో కలుస్తున్న నీరు కూడా కలుషితమై పెద్ద ఎత్తున తాబేళ్లు మరణిస్తున్నాయి. ప్రధానంగా వలల ప్రభావంతోనే అధికంగా తాబేళ్లు మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. కోనాగిల్‌ నెట్‌, అటక, టేకు వలలను మత్స్యకారులు ఉపయోగిస్తుండడంతో వాటిని తట్టుకోలేని తాబేళ్లు మృతి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. తాబేళ్లకు హాని కలుగకుండా మత్స్యకారులు వలలు వాడుకోవాల్సిన అవసరం ఉంది.

  • తాబేళ్లతో మత్స్యసంపదకు చాలా మేలు జరుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్‌ పెంచడంతో పాటు మత్స్య సంపదను వృద్ధి చేయడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. చేపగుడ్లు తినే జెల్లీ ఫిష్‌ జాతిని నియంత్రిస్తాయి. చేపల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడతాయి. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రంపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధికి మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో తాబేళ్ల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోంది. చెన్నైకి చెందిన ట్రీ సంస్థ హెచ్చరికలతో అప్రమత్తమవుతోంది. అన్ని జిల్లాల అధికారులకు తాబేళ్ల సంరక్షణపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాబేళ్లు సైతం వన్యప్రాణుల కిందకు వస్తాయి. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972 ప్రకారం తాబేళ్లను చంపడం నేరం. వాటి గుడ్లను సైతం తినడం, నాశనం చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అందుకే ఈ చట్టాన్ని అనుసరించి తీరంలో తాబేళ్ల సంరక్షణపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

  • తాబేళ్ల రక్షణకు చర్యలు

    జిల్లాలోని తీర ప్రాంతాల్లో తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అవి మృత్యువాత పడకుండా పటిష్ఠ చర్యలు చేపడతాం. చేపల వేట సమయంలో నిబంధనలకు పాటించేలా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 16 తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 5నెలల పాటు 40 మంది మత్స్యకారుల పర్యవేక్షణలో తాబేళ్ల సంతతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాబేళ్లను చంపినా.. వాటికి నష్టం చేకూర్చినా చర్యలు తప్పవు.

    - ఎస్‌.వెంకటేష్‌, జిల్లా అటవీ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Feb 07 , 2025 | 12:17 AM