PACS: పీఏసీఎస్‌ల్లో కంప్యూటరీకరణ
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:25 AM
Computerization వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కంప్యూటరీకరణ లేకపోవడంతో గతంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ.. కాగితరహిత పాలనకు సన్నాహాలు చేస్తోంది.

అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు
గత ఐదేళ్లలో సహకార వ్యవస్థ నిర్వీర్యం
గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం
ఇచ్ఛాపురం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కంప్యూటరీకరణ లేకపోవడంతో గతంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ.. కాగితరహిత పాలనకు సన్నాహాలు చేస్తోంది. డిజిటలైజేషన్ పూర్తిచేసి సభ్యులందరితో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతి రైతుకు ఈకేవైసీ చేసి వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ఆయా సొసైటీల వివరాలు, లావాదేవీలకు సంబంధించి దస్త్రాలు వెళ్లాయి. సహకార సంస్థ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈకేవైసీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,01,671 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే 85 వేల మంది రైతుల ఈకేవైసీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
గతంలో మెరుగైన సేవలు..
గతంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవలో తరించేవి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పీఏసీఎస్‌లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. పీఏసీఎస్‌ల్లో 50 శాతం వాటాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అప్పటికే రైతుభరోసా కేంద్రాలకు అధికారాలు కట్టబెట్టడంతో పీఏసీఎస్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. అందుకే అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎటువంటి రుసుం చెల్లించకుండానే.. రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించిన తరువాత చెల్లించేవారు. అక్కడకు కొద్దిరోజుల తరువాత సభ్యత్వ రుసుం కింద రూ.10 వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో రైతుల సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం ఏకంగా రూ.300కు పెరిగింది. పీఏసీఎస్ కార్యవర్గాల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు మించిన ఖర్చుగా మారాయి. దీంతో పీఏసీఎస్‌ల్లో అవినీతి కూడా పెరిగిపోయింది. అలాగే గతంలో నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు రుణాలు ఇస్తే.. అక్కడ నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, ఆపై ప్రాంతీయ కో-ఆపరేటివ్ బ్యాంకులకు రుణాలు సర్దుబాటు చేసేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సహకార వ్యవస్థకు నిధుల సర్దుబాటు నిలిచిపోయింది. దీంతో జిల్లాలో సహకార బ్యాంకుగా ఉన్న డీసీసీబీ వైసీపీ హయాంలో రైతు సేవలకు దూరమైంది. సాధారణ వాణిజ్య బ్యాంకులా మారిపోయింది. కంప్యూటరీకరణను సైతం అటకెక్కించారు. వీటన్నింటి గాడిలో పెట్టేందుకు, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వివరాలు సేకరిస్తున్నాం
జిల్లావ్యాప్తంగా ఉన్న 37 పీఏసీఎస్‌ల పరిధిలో కంప్యూటరీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రైతుల వివరాల సేకరణ తుది దశకు చేరుకుంది. సహకార శాఖతో పాటు సచివాలయ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. పూర్తికాగానే కంప్యూటరీకరణ చేపడతాం.
- నగేష్, జిల్లా సహకార శాఖ అధికారి, శ్రీకాకుళం