Share News

ICDS: ఐసీడీఎస్‌లో కలకలం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:48 PM

ICDS.. Controversy స్ర్తీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఓ అధికారిణి అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ.. ఉద్యోగులు, సిబ్బందిపై పెత్తనం చెలాయించే ఆమె తీరుపై.. ‘ఎలుకల బోన్లనూ వదల్లే’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పందించాయి.

ICDS: ఐసీడీఎస్‌లో కలకలం

  • అధికారిణి అక్రమాలపై ఇంటెలిజెన్స్‌ ఆరా

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చర్చ

    రణస్థలం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): స్ర్తీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఓ అధికారిణి అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ.. ఉద్యోగులు, సిబ్బందిపై పెత్తనం చెలాయించే ఆమె తీరుపై.. ‘ఎలుకల బోన్లనూ వదల్లే’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పందించాయి. సమస్యలు పరిష్కరించుకుంటూ.. సమన్వయంగా విధులు నిర్వహించాల్సిన చోట కక్షసాధింపు చర్యలు ఏమిటనేదానిపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఆ అధికారిణి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఐసీడీఎస్‌లో అధికారిణి తీరుతో సూపర్‌ వైజర్లు, సీడీపీవోలు, కొంతమంది ఉద్యోగులు కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆమె పొరుగుశాఖ నుంచి వచ్చి.. నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తామంతా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుకు కృషి చేస్తున్నామని, కాగా.. కార్యాలయానికి సంబంధం లేని పనులను అప్పగిస్తే ఎవరు చేస్తారంటూ కొంతమంది లోలోపల మథనపడుతున్నారు. అధికారిణి వేధింపులు భరించలేక పలువురు సీడీపీవోలు, ఏసీడీపీవోలు ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సైతం కొంతమంది సీడీపీవోల నుంచి ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో జరుగుతున్న తంతుపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఆధారాలతో సహా ఆమె అక్రమాలను ఆ శాఖమంత్రి దృషికి తీసుకెళ్లేందుకు కొంతమంది ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు.. కూటమి ప్రభుత్వంలో కొనసాగేందుకు వీలు లేకుండా చూడాలని మంత్రిని కోరనున్నట్టు తెలిసింది.

Updated Date - Jan 07 , 2025 | 11:48 PM