చిరస్మరణీయుడు ఎర్రన్నాయుడు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:41 AM
దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు తన స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం ఘనంగా జరిగాయి.

- నివాళులర్పించిన మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు తన స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామంలోని ఎర్రన్న ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయకుమారి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడని, జిల్లా కీర్తిని దేశానికి చాటిచెప్పిన గొప్పవ్యక్తని మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం, పాతపట్నం శాసన సభ్యులు గొండు శంకర్, మామిడి గోవిందరావు, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, మాజీ శాసన మండలి సభ్యులు విశ్వప్రసాద్, టీడీపీ నాయకులు, తదితరులు ఎర్రన్న ఘాటువద్ద నివాళులర్పించారు.