Share News

chilli: మిర్చి రైతుకు.. కన్నీరు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:14 AM

Decreased chilli cultivation జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, గార, పోలాకి, నరసన్నపేట తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. గుంటూరు తర్వాత స్థానంలో సిక్కోలు ఉండేది. ఇక్కడి నుంచే మిర్చి పంట ఢిల్లీ, కాన్ఫూర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. కాగా.. జిల్లాలో క్రమేపీ మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడంతో గుంటూరు వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొనే దుస్థితి ఏర్పడింది.

chilli: మిర్చి రైతుకు.. కన్నీరు
చిలకపాలెంలో ఓ కొనుగోలు కేంద్రంలో మిర్చిని గ్రేడింగ్‌ చేస్తున్న మహిళలు

  • జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం

  • దిగుబడిపై మంచు ప్రభావం

  • ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

  • మిర్చి.. ఒకప్పుడు గుంటూరు తర్వాత సిక్కోలులో విస్తారంగా సాగయ్యేది. ఇక్కడ నుంచే ఢిల్లీ, కాన్పూర్‌ తదితర ప్రాంతాలకు మిర్చి ఎగుమతి అయ్యేది. ఏటా ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు కళకళలాడేవి. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. మరోవైపు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో మిర్చి రైతులకు కన్నీరే మిగులుతోంది. దీంతో మిర్చి సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది.

  • ఎచ్చెర్ల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, గార, పోలాకి, నరసన్నపేట తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. గుంటూరు తర్వాత స్థానంలో సిక్కోలు ఉండేది. ఇక్కడి నుంచే మిర్చి పంట ఢిల్లీ, కాన్ఫూర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. కాగా.. జిల్లాలో క్రమేపీ మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడంతో గుంటూరు వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొనే దుస్థితి ఏర్పడింది. స్థానిక ప్రజల అవసరాల మేరకు కూడా సాగు చేపట్టకపోవడంతో వ్యాపారాలు కూడా సన్నగిల్లాయి. సాధారణంగా మిర్చి దిగుబడి జనవరి నెలలోనే రావల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటికీ మిర్చి దిగుబడి అంతంతమాత్రంగా ఉంది. విపరీతమైన మంచు ప్రభావంతో దిగుబడి తగ్గింది. ఉదయం 9 గంటల వరకూ మంచు కురవడంతో పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు వివిధ రకాల తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గడమే కాకుండా, ఆలస్యంగా పంట చేతికి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా మిర్చి సాగులో జాప్యమైనట్టు ఉద్యానశాఖాధికారులు అభిప్రాయ పడుతున్నారు.

  • జిల్లాలో సాగు ఇలా

  • రణస్థలం, పైడిభీమవరం లావేరు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కూరాకుల మిర్చి సాగు చేస్తున్నారు. గార, లబ్బోడిపేట, ఇప్పిలి, కొయ్యానపేట, పోలాకి, వెదుళ్లవలస, డోల, లంకపేట, సుగ్గు అగ్రహారం, శాలిహుండాం, కళింగపట్నం, తదితర ప్రాంతాల్లో సారూ మిర్చి పండిస్తున్నారు. నరసన్నపేట ప్రాంతంలో పచ్చి మిర్చి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడి నుంచి పచ్చిమిర్చి విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. గుంటూరులో మిర్చి కిలో రూ.80 నుంచి రూ.90వరకు విక్రయిస్తున్నారు. దీంతో జిల్లాలో కూడా ఆ ప్రభావం పడి ధరలు తగ్గాయని రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది కూరాకుల మిర్చి కిలో రూ.200 ఉండగా.. ఈ ఏడాది రూ.140కి ధర పడిపోయింది. అలాగే పులికట్‌ రకం గతేడాది కిలో రూ.160 ఉండగా.. ప్రస్తుతం రూ.90కి మించి అమ్మలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.

  • కారణాలెన్నో..

  • మిగిలిన పంటలతో పోలిస్తే మిర్చి సాగులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పంట చేతికి వచ్చేవరకు శ్రమతో కూడిన పని. ధరలు కూడా నిలకడగా ఉండవు. మరోవైపు మంచు, తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గుతుంది. దీంతో మిర్చి సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగల్లింది. దీని స్థానంలో కూరగాయలు, పుచ్చకాయలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఉదాహరణకు లావేరు, రణస్థలం మండలాల్లో గతేడాది వరకు మిర్చి సాగు చేసే రైతులు.. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల్లో పుచ్చకాయలు పండిస్తున్నారు.

  • క్రిమిసంహారక మందులు, పురుగుల మందుల వినియోగంతో మిర్చి పంట నాణ్యత బాగా తగ్గుతోంది. ఈ కారణంగా కోల్డ్‌స్టోరేజీలో నిల్వకు పనికిరాకుండా ఉంది. నిల్వ ఉంచితే మిర్చి రంగు మారిపోతోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో నిల్వ చేసేందుకు ట్రేడర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.

  • కొనుగోలు కేంద్రాలు వెలవెల-

    జిల్లాలో చిలకపాలెం, పొందూరులో మిర్చి కొనుగోలు కేంద్రాలు ఒకప్పుడు ఈ సీజన్‌లో కళకళలాడుతుండేవి. చిలకపాలెంలో 4, పొందూరులో 8 కేంద్రాల ద్వారా మిర్చి కొనుగోలు జరిగేది. మిర్చి దిగుబడి విపరీతంగా తగ్గడం, ఎగుమతికి అవకాశం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

  • సాగుకు ఇబ్బంది

    కొన్నేళ్లుగా మిర్చిని సాగు చేస్తున్నాం. మిర్చి సాగు చాలా ఖర్చుతో కూడుకున్నపని. అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటికీ పంట చేతికి రాలేదు. ఎకరా పొలంలో మిర్చి సాగునకు వేలాది రూపాయలు ఖర్చు చేసినా.. పంట వస్తుందా లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఏటా మిర్చి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది.

    - తంగి మల్లేశ్వరరావు, రైతు, తంగివానిపేట

  • సాగు బాగా తగ్గింది

    చిలకపాలెం కేంద్రంగా నాలుగు దశాబ్దాలుగా మిర్చి వ్యాపారాన్ని చేస్తున్నాం. ఒకప్పుడు ఇక్కడి నుంచే ఢిల్లీ, కాన్పూర్‌ తదితర ప్రాంతాలకు మిర్చి ఎగుమతయ్యేది. సుమారు పదేళ్లుగా మిర్చి సాగు బాగా తగ్గింది. ఈ ఏడాది మరింత తగ్గింది.

    - ఆట్ల సత్యానందం, ట్రేడర్‌, చిలకపాలెం

Updated Date - Feb 26 , 2025 | 12:14 AM