ధాన్యం కొనట్లే!
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:45 AM
‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు.’ అని ప్రభుత్వం ఆదేశించినా చాలాచోట్ల అధికారులు పట్టించుకోవడం లేదు. టార్గెట్ అయిపోయిందంటూ చాలా మండలాల్లో ధాన్యం కొనుగోలును నిలిపివేశారు.

- సరుబుజ్జిలిలో నిలిపివేసిన అధికారులు
- లక్ష్యం పూర్తయిందంటున్న వైనం
- ఇబ్బందులు పడుతున్న రైతులు
- రోడ్ల పక్కన, పొలాల్లో ధాన్యం బస్తాల నిల్వ
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు.’ అని ప్రభుత్వం ఆదేశించినా చాలాచోట్ల అధికారులు పట్టించుకోవడం లేదు. టార్గెట్ అయిపోయిందంటూ చాలా మండలాల్లో ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పొలాల్లోనే ధాన్యం కుప్పలు, బస్తాలు ఉన్నాయని, వాటిని ఏమి చేయాలని ప్రశ్నిస్తున్నారు. సరుబుజ్జిలి మండలంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. గత డిసెంబరు నాటికే ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయినట్లు అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరుబుజ్జిలి మండలంలోని 14 గ్రామ సచివాలయాల పరిధిలో 2,446 ఎకరాల వరి విస్తీర్ణంకు గాను ఈ-క్రాప్ చేశారు. దీనికి సంబంధించి 6,458 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా విధించారు. అయితే, ఈ లక్ష్యం పూర్తయిందని, ఇక ధాన్యం తీసుకోమని అధికారులు చెబుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని రొట్టవలస, కొండవలస, కొత్తకోట, షలంత్రి, సరుబుజ్జిలి, సింధువాడ, ఇసకలపాలెం, విద్యారామపురం, పురుషోత్తపురం, తదితర పంచాయతీల్లో ధాన్యం కొనుగోలు ఆగిపోయాయి. రైతులు తమ ధాన్యం బస్తాలను పంట పొలాల్లో, రోడ్డుపక్కన నిల్వ చేసి కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతు సేవా కేం ద్రాల కొనుగోలు జరగకపోవడంతో వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. 80 కేజీల ధాన్యం బస్తాకు అదనంగా మూడు కేజీల ధాన్యం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.150కు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తుందని రొట్టవలసకు చెందిన రైతులు తొత్తడి వైకుంఠరావు, బొంగు సత్యనారాయణ, తాడేల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇంకా పూర్తిస్థాయిలో నూర్పులు చేపట్టక ముందే లక్ష్యాలు ఎలా పూర్తయ్యాయో అధికారులు చెప్పాలి. ట్రక్ షీట్ కోసం వెళితే లక్ష్యం పూర్తి జరిగిందంటున్నారు. ధాన్యాన్ని పంట పొలాలు, రోడ్డుపక్క నిల్వ చేయలేక ఇబ్బందులు పడుతున్నాం.
-బెవర లక్ష ్మణరావు, రైతు, రొట్టవలస
ఇండెంట్ పెట్టాం..
మండలంలో ధాన్యం కొనుగోలు లక్ష్యాలు పూర్తయ్యాయి. రైతుల సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. రెండో విడత కొనుగోలు కోసం ఈ నెల 17న తహసీల్దార్ ఇండెంట్ పెట్టారు. త్వరలో కొనుగోలు ప్రారంభిస్తాం.
-సత్యనారాయణ, మండల పౌరసరఫరాల శాఖ డీటీఎం