Rape of girls: మృగాళ్లు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:13 AM
Rape of girls:జిల్లాలో ముగ్గురు మగాళ్లు మృగాలుగా మారారు. సారవకోట మండలంలో ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారం చేయగా, పలాస పట్టణంలో మరోక వ్యక్తి 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

రెండుచోట్ల ఇద్దరు బాలికలపై అత్యాచారం
నిందితులపై పోక్సో కేసు నమోదు
మరోచోట ఘటనలో నిందితుడి అరెస్టు
జిల్లాలో ముగ్గురు మగాళ్లు మృగాలుగా మారారు. సారవకోట మండలంలో ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారం చేయగా, పలాస పట్టణంలో మరోక వ్యక్తి 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పలాస మండలంలో ఇంకొక వ్యక్తి ఓ దివ్యాంగురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ మూడు ఘటనలపై కేసులు నమోదుకాగా, ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
తినుబండారాలు ఇచ్చి..
జలుమూరు (సారవకోట) ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పి.ముకుందరావు అలియాస్ రామారావు అనే వ్యక్తి సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం మేరకు.. బాలిక సోమవారం సాయంత్రం పిల్లలతో కలిసి వీధిలో ఆడుకుంటుండగా ముకుందరావు ఆమెను తన ఇంటికి పిలిచాడు. తినుబండారాలు ఇచ్చి లోపలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఏడ్చుకొని తన ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజులుగా..
పలాస, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పలాస పట్టణంలోని ఓ వీధిలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలికపై అదే వీధికి చెందిన బి.శివ అనే వ్యక్తిపై నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శివపై మంగళవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. నిందితున్ని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు కొద్ది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. వివాహానికి భాస్కరరావు అంగీకరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు రెండు రోజుల కిందట పలాస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి పలాస మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. భాస్కరరావును పాతపట్నం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.