Heart injuction: పేదల గుండెకు భరోసా
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:09 AM
Heart patients గుండెపోటు బాధితులకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.45వేలు విలువ చేసే.. టెనెక్టేప్లెస్ ఇంజక్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. అన్ని ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచడంతో ఎంతోమంది పేద ప్రజల గుండెకు కొండంత భరోసా కలుగుతోంది.

గుండెపోటుకు ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్లు
ప్రభుత్వాసుపత్రులకు సరఫరా
జిల్లాలో అందుబాటులో 137 డోసులు
సకాలంలో స్పందిస్తేనే.. మేలు
హరిపురం/ ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి):
ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగకు చెందిన నీలాపు ధర్మరాజురెడ్డి గత నెల 28న గుండెపోటుకు గురయ్యారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ఛాతినొప్పి రాగా.. వెంటనే కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు సిద్ధంగా ఉన్న టెనెక్టేప్లెస్ ఇంజక్షన్‌ను ఉచితంగా వేయడంతో ఆయన కోలుకున్నారు. రెండు రోజుల తర్వాత శ్రీకాకుళం మండలం రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో యాంజోగ్రామ్ చేశారు. స్టంట్స్ అవసరం కావడంతో ఆరోగ్యశ్రీలో భాగంగా వేశారు. ఈ నెల 10న ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
...............
ఏడాది కిందట ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఇంట్లో ఉండగా ఛాతినొప్పితో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు రూ.45వేలు విలువ చేసే టెనెక్టేప్లెస్ ఇంజక్షన్‌ను వేశారు. కోలుకున్న తరువాత విశాఖ తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజోగ్రామ్ తరువాత స్టంట్స్ వేశారు.
............
గుండెపోటు బాధితులకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.45వేలు విలువ చేసే.. టెనెక్టేప్లెస్ ఇంజక్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. అన్ని ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచడంతో ఎంతోమంది పేద ప్రజల గుండెకు కొండంత భరోసా కలుగుతోంది. కొవిడ్ తరువాత చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అధికశాతం గుండెపోటుకు గురవుతున్నారు. గుండెపోటు వచ్చిన వారిని రక్షించడం, చికిత్స అందించడంలో తొలిగంటే కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్టెమీ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వ్యక్తిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించేందుకు వీలుగా జిల్లా కేంద్రంతో పాటు ఏరియా ఆసుపత్రుల్లో టెనెక్టేప్లెస్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. గుండెపోటుకు గురైన వ్యక్తికి రక్తం సరఫరా చేసే నాళాలు గడ్డ కడతాయి. దానిని నియంత్రించేందుకు ఈ ఇంజక్షన్లు ఎంతగానో దోహదపడతాయి. గుండె పోటుకు గురైన గంట వ్యవధిలో వీటిని అందించాల్సి ఉంటుంది. అలా ఇంజక్షన్లు అందక చాలామంది మృత్యువాత పడుతుంటా రు. గుండె పోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తర లించాలి. ఈసీజీ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి... గుండెపోటు లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారణకు వస్తే రూ.45 వేల విలువ చేసే టెనెక్టెప్లెస్ ఇంజక్షన్‌ను ఉచితంగా అందించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. ఆపై మెరుగైన వైద్య సేవల కోసం రిఫర్ చేస్తారు. ఎన్.టి.ఆర్. ఆరోగ్యసేవలో వైద్య సేవలు ఉచితంగా అందజేస్తారు. జిల్లాలోని మొత్తం 18 ఆస్పత్రుల్లో 137 డోసులు ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా జిల్లా శివారు ప్రాంతాల వారికి ఈ ఇంజక్షన్లు ప్రాణాలు నిలుపుతున్నాయనే చెప్పొచ్చు. ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలవారు అత్యవసర వైద్యసేవలకు శ్రీకాకుళం, విశాఖ వెళ్లాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో స్థానికంగా సీహెచ్‌సీల పరిధిలోనే ఈ ఇంజక్షన్లు అందుబాటులో ఉండడంతో ఎంతోమందికి ఉపశమనం లభిస్తోంది.
మొత్తం 92 మందికి..
హరిపురం సీహెచ్‌సీ పరిధిలో గడచిన రెండు నెలల కాలంలో ఐదుగురు వ్యక్తులకు ఈ ఇంజక్షన్ ద్వారా ప్రాణాలు కాపాడారు. అందులో ముగ్గురు తక్షణమే కోలుకోవడంతో ఇళ్లకు పంపించారు. మరో ఇద్దరిని జిల్లా సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. వారిద్దరూ కోలుకున్నారు. గత ఆరు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 92 మందికి ఈ ఇంజక్షన్లు వేయడం ద్వారా ప్రాణాలు నిలిపినట్టు డీసీహెచ్‌ఓ డాక్టర్ కల్యాణ్‌బాబు తెలిపారు.
ఇవీ లక్షణాలు..
ఛాతిలో నొప్పిగా అనిపించడం, ఎడమ భుజం లాగడం, ఉన్నఫళంగా ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటుగా గుర్తించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రాఽథమిక చికిత్స కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి.
ఎంతో ప్రయోజనకరం..
జీవనశైలిలో మార్పులతో వస్తున్న రక్తపోటు, మధుమేహంతో ధీర్ఘకాలంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే రూ.లక్షల్లో ఖర్చవుతోంది. గుండె పోటు లక్షణాలు గుర్తించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ప్రధానంగా చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల వారికి గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండరు. బాధితులు దూరంలో ఉన్న ప్రధాన అసుపత్రులకు వెళ్లే లోపు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.
ఆస్పత్రుల వారీగా ఇలా..
జిల్లాలోని సీహెచ్‌సీలు, ప్రధాన ఆస్పత్రులైన టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, కొత్తూరు, కవిటి, రణస్థలం కోటబొమ్మాళి, పొందూరు, నరసన్నపేట, బుడితి, ఆమదాలవలస, ఇచ్చాపురం, పాతపట్నం, బారువ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్లను అందుబాటు లో ఉంచారు. వీటి వినియోగంపై ఇప్పటికే వైద్యులకు శిక్షణ అందించారు. ఇంజక్షన్ వేసేందుకు ప్రతి వైద్యశాలలో ప్రత్యేకంగా స్టెమ్ గదిని ఏర్పాటు చేశారు.
యాప్ ద్వారా పర్యవేక్షణ..
ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి కనీసం అయిదు ఇంజక్షన్లకు తగ్గకుండా ఆదుబాటులో ఉంచుతున్నారు. హరిపురం ఆస్పత్రికి తొమ్మిది ఇంజక్షన్లు పంపించారు. అవసరం మేరకు మళ్లీ తెప్పిస్తాం. గుండె నొప్పితో వచ్చిన వారికి ముందుగా స్టెమ్ గదిలో ఈసీజీ తీసి అందులో గుర్తించిన తీవ్రత, అవసరాన్ని బట్టి ఇంజక్షన్ ఇస్తారు. దీనివల్ల రక్తం గడ్డ కట్టకుండా సుల భంగా ప్రసరణ జరుగుతుంది. మరోసారి ఈసీజీ తీసి రిపోర్టు ను ప్రత్యేక యాప్ ద్వారా జీజీహెచ్‌లోని కార్డియాలజిస్ట్‌కు పంపుతారు. ఆయన సలహా మేరకు పరిస్థితి బాగుంటే ఇంటికి పంపిస్తాం. లేదంటే పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తాం.
-డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, హరిపురం
.............
ప్రభుత్వాస్పత్రికి తేవాలి
గుండెపోటు లక్షణాలు కనిపించిన గంటలోపు చాలా కీలకం. వెంటనే ప్రభుత్వాస్పత్రులకు తీసుకెళ్తే ఈసీజీ తీస్తారు. గుండెపోటు అని తేలితే వెంటనే ఇంజక్షన్ చేస్తారు. ఆపై ఆరోగ్యశ్రీ విభాగం వైద్యసేవలు ఉన్న ఆస్పత్రులకు తరలించి ఆపరేషన్లు చేస్తారు. అవగాహన లేక చాలామంది ఈ సేవలు వినియోగించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
- పి.దేవేంద్ర రెడ్డి, సూపరింటెండెంట్, ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రి