'Artist' Chittibabu ‘కళాప్రవీణ’ చిట్టిబాబు ఇకలేరు
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:30 AM
లలిత సంగీతమే జీవిత గమ్యంగా భావించిన హార్మోనియం వాయి ద్య కళాకారులు, సిక్కోలు కళాప్రవీణగా గుర్తింపు పొందిన బండారు చిట్టిబాబు(89) బుధవారం తన స్వగృహంలో మృతి చెం దారు.
సంగీతరంగం మూగబోయింది
ఎందరో గాయకులను తయారు చేసిన ‘బండారు’
శ్రీకాకుళం కల్చరల్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): లలిత సంగీతమే జీవిత గమ్యంగా భావించిన హార్మోనియం వాయి ద్య కళాకారులు, సిక్కోలు కళాప్రవీణగా గుర్తింపు పొందిన బండారు చిట్టిబాబు(89) బుధవారం తన స్వగృహంలో మృతి చెం దారు. వివరాలిలా ఉన్నాయి.. బండారు చిట్టిబాబు 1936లో సత్య నారాయణ, వరహాలమ్మలకు ఐదో సంతానంగా జన్మించారు. సుమా రు ఏడు దశాబ్దాలుగా సంగీత పయనంలో అసమాన ప్రతిభతో 400 పైగా లలిత గీతాలకు స్వరక ల్పన చేశారు. నాడు సంగీత రంగంలో నిష్ణాతులైన పేరయ్య శాస్త్రి, బొంపాడ రామచంద్రరావు, రామన్న వద్ద ఈయన శిష్యరికం చేశారు. 1955లో సినీనటుడు రావికొండలరావు, తిమ్మ రాజు శివరావు, బంగారు క్లారినెట్ గ్రహీత సీహెచ్ నర్సింహులు సహకా రంతో సుకుమార్ ఆర్కెస్ట్రాను నెలకొల్పారు.
రథసప్తమి నాడు ఆదిత్యుని ఏకాంతసేవ
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే రథసప్తమి పర్వదినం సందర్భంగా రాత్రి స్వామివారి ఏకాంత సేవ నిర్వ హించడం ఆనవాయితీ. ఈ ఏకాంతసేవ కీర్తనలను స్వరపరిచి వ్యక్తి చిట్టిబాబు. సుమారు 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఏకాంతసేవలో ప్రఖ్యాత గాయకులు జి.ఆనంద్, బీఏ నారాయణ, మండపాక శారద, డా.ఈఎస్ సంపత్‌కుమార్ తదితర గాయకులు భాగస్వాములయ్యారు.
బాలమురళీకృష్ణ చేతుల మీదుగా ‘కళాప్రవీణ’ బిరుదు
తిరుపతిలో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో ‘కళామతల్లికి నమో నమో అంటూ’ స్వరపరచిన గీతంతో ఎంతో గుర్తింపు పొందారు. సినీ రచయితలు దేవులపల్లి ఆరుద్ర, సి.నారాయణరెడ్డి (సినారె), జొన్నవిత్తుల, శ్రీకాకుళం రచయిత దూసి ధర్మారావు రచించిన లలిత గీతా లను స్వరకల్పన చేస్తూ హార్మోనియంపై వాయిద్య సహకారం అందించారు. ‘అంటరానివారు ఎవరం టే, ఏది హిందూ, ఏది ముస్లిం’ పాట లను జాతీయ భాషల్లో కూడా స్వరప రిచారు. సత్యసాయిబాబా, రాధాకఽథ, విశ్వర థం, సుధా బింధువులు సినిమాలకు సంగీ త దర్శకత్వం వహించారు. గాయకులు బాల మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి, రామకృష్ణ, జి.ఆనంద్ తదితరుల సంగీత సారఽథ్యంలో పనిచేశారు. గానగంధర్వులు ఘంటసాల భగవద్గీత స్వరకల్పనకు బండారు చిట్టి బాబు సహకారం తీసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు చేతల మీదుగా సత్కారం పొందారు. 1974లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. 1983లో బాల మురళీకృష్ణ కళాప్రవీణ బిరుదు ఇచ్చి అభినందించారు. 1984లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా చిట్టిబాబు సేవలం దించారు. ఈయన కుమారుడు బండారు రమణ మూర్తి తబలా వాయిద్య కళాకారుడిగా రాణిస్తున్నారు. చిట్టిబాబు వేలాది మంది గాయనీ గాయకులను తయారు చేశారు. ఇప్పటికీ ఆయన శిష్యులు రాష్ట్ర వ్యాప్తంగా గాయకులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు.
ప్రముఖుల నివాళి
బండారు చిట్టిబాబు మృతిపై ఆయన సహచరులు, గాయకులతో పాటు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ బీఏ నారాయణ, సంగీత విద్వాంసురాలు మండపాక శారద, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగ న్మోహన్, ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, నిక్కు అప్పన్న, డా.ఈఎస్ సంపత్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు.