Alcohol : పండగకు తగ్గిన మద్యం విక్రయాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:57 PM
alcohol sales పండగ అంటేనే సందడి. అత్యధిక మంది మందుబాబులు ఎదురుచూసేది పండగ రోజుల కోసమే. ఏటా పండగ సీజన్‌లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం పండగకు మద్యం హవా తగ్గింది.

గతేడాదితో పోల్చితే తక్కువే
శ్రీకాకుళం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పండగ అంటేనే సందడి. అత్యధిక మంది మందుబాబులు ఎదురుచూసేది పండగ రోజుల కోసమే. ఏటా పండగ సీజన్‌లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం పండగకు మద్యం హవా తగ్గింది. జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈసారి మద్యం విక్రయాలు తగ్గాయి. రేట్లు తగ్గింపుతో ఆదాయంలోనూ తేడా వచ్చింది. పండగకు ముందుగానే కొంతమంది మద్యం కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు.
గతేడాది కంటే 33.28 శాతం తగ్గుదల..
గతేడాది జనవరి 13 నుంచి 16 వరకు.. 34,946 కేసుల ఐఎంఎల్ మద్యం, 11,228 బీరు కేసులు విక్రయించారు. వీటి మొత్తం విలువ రూ.26.65 కోట్లు. ఈ ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు 24,597 ఐఎంఎల్ మద్యం కేసులు, 7,114 బీరు కేసులు విక్రయించారు. వీటి విలువ రూ. 17.78 కోట్లు మాత్రమే. మొత్తం - 33.28 శాతం విక్రయాలు తగ్గిపోయాయి.
16 రోజుల విక్రయాలు బాగానే..
గతేడాది.. జనవరిలో 1 నుంచి 16 వరకు కంటేనూ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి 16 వరకు విక్రయాలు బాగానే ఉన్నాయి. ఆదాయంలో మాత్రం స్వల్పంగా తేడా ఉంది. మొత్తం 12 సర్కిళ్ల(ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, నరసన్నపేట, పలాస, పాతపట్నం, పొందూరు, రణస్థలం, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి) పరిధిలో గతేడాది జనవరిలో 16 రోజులలో 80,843 ఐఎంఎల్ మద్యం కేసులు, 20926 బీరు కేసులు విక్రయించారు. వీటి విలువ రూ. 67,71,58,266. ఈ ఏడాది జనవరిలో 16రోజులకు గాను 91,434 ఐఎంఎల్ మద్యం కేసులు, 25,940 బీరు కేసుల విక్రయించారు. వీటి విలువ రూ.63,85,08,017 మాత్రమే. మద్యం, బీర్లు విక్రయాలు పెరిగినా ఆదాయం తగ్గడానికి గల కారణం.. మద్యం రేట్లు బాగా తగ్గించడమే. కూటమి ప్రభుత్వం కొద్దినెలలు కిందట రూ.99కే మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మందుబాబులకు కొంత ఉపశమనం లభించింది.