భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:59 PM
రథసప్తమి రోజున ఆదిత్యుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు.

అరసవల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రథసప్తమి రోజున ఆదిత్యుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. ఆర్డీవో ప్రత్యూష, ఇతర అధికారులతో కలిసి రథసప్తమి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ముం దుగా ఆలయ మ్యాప్‌ను పరిశీలించి, ఎక్కడెక్కడ ఎంత మంది సిబ్బంది అవసరం అన్న విషయాలపై చర్చించా రు. ఆలయ సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడ్ల ఏర్పాటు, క్యూలైన్లు, ప్రవేశ ద్వారం, మండపం, ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శన మార్గం, ప్రసాదం కౌంటర్లు, కేశఖండన శాల తదితర ప్రదేశాలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి క్యూలైన్ల నిర్వహణ క్రమపద్ధతిలో ఉండాలన్నారు. పటిష్ఠమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. అనంతరం ఈవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
అందరికీ న్యాయం..
ఏడాదిగా దినసరి వేతనంపై పనిచేస్తున్న వారికి జీతాలు అందకపోవడంపై కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు. రథసప్తమి ఉత్సవాలు ముగిసిన తరువాత ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసు కుంటామన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఈవో భ ద్రాజీ ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం డీసీ శోభారాణి, విజయనగరం నుంచి ఈవో ప్రసాదరావు, స్తపతి శ్రీనివాసాచార్యులు, దుర్గేష్, ఈఈ కృష్ణ, డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడపునాయుడు, నాగరాజు, ఎస్‌ఐ హరికృష్ణ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
రథసప్తమి వేడుకలకు రండి
తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వ హిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక లకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆహ్వనించారు. విజయవాడలో లోకేశ్‌ను కలిసిన ఆయన... ఉత్సవాలకు రావాలని కోరారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాటి నుంచి ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని చెప్పారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, కలెక్టర్, ఎస్పీలతో కలిసి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని లోకేశ్‌కు వివరించారు. అభివృద్ధి పనులపై ఫొటోలు, వీడియోలను ఆయనకు చూపించి... తొలి పండుగకు రావాలంటూ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై లోకేశ్ సానుకూలంగా స్పందిస్తూ అన్ని విధాలా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున రావడానికి కుదరదని... ఆ తరువాత తప్పక వస్తానని హామీ ఇచ్చారని శంకర్ తెలిపారు.