సుదూర తీరం.. పర్యాటకం లేదాయె!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:10 AM
No tourism! జిల్లాలో సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటకరంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

పదుల సంఖ్యలో బీచ్‌లు ఉన్నా నిష్ఫలం
ఉండడానికి నీడ, తాగేందుకు నీరు కరువు
పొరుగునే ఒడిశాకు వెళ్తున్న పర్యాటకులు
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమిది!
ఇచ్ఛాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
ఒడిశాలోని సున్నాపూర్ బీచ్.. ఇచ్ఛాపురానికి కూతవేటు దూరంలో ఒడిశా భూ భాగంలో ఉంది. ఈ బీచ్‌ను గత ఐదేళ్లుగా ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కోట్లాది రూపాయలతో సదుపాయాలు కల్పించింది. కాటేజీలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఉత్తరాంధ్ర పర్యాటకులు సైతం సున్నాపూర్ బీచ్‌కు వెళుతున్నారు.
................................
ఇచ్ఛాపురంలోని శివకృష్ణాపురం-డొంకూరు తీర ప్రాంతానికి ఏటా ప్రత్యేక దినాలతో పాటు కార్తీక మాసంలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కానీ, ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. ఎండకు తలదాచు కోవడానికి నిలువునీడ లేదు. తాగేందుకు నీరు కూడా దొరకదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ బీచ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పర్యాటకుల కోసం ఎలాంటి వసతులు సమకూర్చలేదు. దీంతో పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సున్నాపూర్ బీచ్‌ను గుర్తుకు తెచ్చుకొని ఇక్కడకు వచ్చిన వారు నిట్టూరుస్తుంటారు.
.................................
జిల్లాలో సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటకరంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. వాటితో నిర్మాణాలు కూడా జరిగాయి. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. ఐదేళ్లలో ఎక్కడా పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఇచ్ఛాపురం మండలం శివకృష్ణాపురం-డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఈ తీర ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. ముఖ్యంగా డొంకూరు, కవిటి, బారువ, అక్కుపల్లి, భావనపాడు, కళింగపట్నం, మొగదాలపాడు, కళ్లేపల్లి, గనగళ్లపేట, బందరువానిపేట తీరాలు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ, గత వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గార మండలంలోని కళింగపట్నం బీచ్ చాలా అభివృద్ధి చెందింది. భారీ ఒంటెలతో పాటు కొన్నిరకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పర్యాటక ఉత్సవాలు కూడా జరిపారు. తీరం వరకూ రహదారులను సైతం ఏర్పాటు చేశారు. రిసార్ట్స్ సైతం నిర్మించారు. అయితే, వైసీపీ పాలనలో ఈ బీచ్ పూర్తిగా నిర్వీర్యమైంది. నిర్వహణను గాలికొదిలేసిన జగన్ సర్కారు రిసార్ట్స్‌లో బార్‌ను మాత్రం నడిపించింది. జిల్లాలోని మిగతా బీచ్‌లది కూడా ఇదే పరిస్థితి.
అభివృద్ధి చేస్తే ఎంతో మేలు..
ఒడిశాలోని సున్నాపూర్ బీచ్‌కు ఏమాత్రం తగ్గని విధంగా జిల్లాలోని బీచ్‌లను ఎంతో అభివృద్ధి చేయవచ్చు. జిల్లా తీర ప్రాంతం వెంబడి కొబ్బరి, జీడి, ఇతర ఉద్యాన పంటలు కనువిందు చేస్తాయి. బాహుదా, మహేంద్ర తనయా, వంశధార, నాగావళి నదీ సంగమాలు ఉన్నాయి. తీరానికి దగ్గరగా పురాణ, చారిత్రక, ఇతిహాసాలతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చిత్తడి, బీల నేలల శోయగం కూడా. విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడకు పక్షులు వస్తుంటాయి. తెలవారగానే కిలకిలారావాలతో నిద్రలేపుతాయి. పూండి, నౌపడ ఉప్పుగళ్లీలు, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎర్రమట్టి దిబ్బలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిరుద్యోగ యువతకు మెండుగా ఉపాధి లభిస్తుంది.
అభివృద్ధి చేస్తాం
బీచ్‌ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం కొత్త పాలసీ తెస్తాం. జిల్లాలోని బీచ్‌ల్లో పర్యాటకుల సందడి బాగా పెరిగింది. వారికి అనుకూలంగా ఉండేలా బీచ్‌లు అభివృద్ధి చేస్తాం.
- బెందాళం అశోక్, ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే
బెంచీలు కూడా ఉండవు
జిల్లాలోని ఏ బీచ్‌లో కూడా కనీస వసతులు లేవు. కేవలం సముద్రం చూసి రావడానికి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తీరంలో బెంచీలు కూడా ఉండవు. ఇచ్ఛాపురం పక్కనే ఉన్న ఒడిశాకు చెందిన సున్నాపూర్ బీచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ బీచ్ మాదిరిగానే ఇక్కడ కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.
- దక్కత సుమన్‌రెడ్డి (రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్), ఇచ్ఛాపురం
ఒడిశా బీచ్‌లే దిక్కు
కుటుంబంతో కలిసి శివకృష్ణాపురం-డొంకూరు బీచ్‌కు వెళితే అక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. ఎండకు, వర్షానికి తలదాచుకోవాలంటే చెట్లే గతి అవుతున్నాయి. అందుకే జిల్లా ప్రజలకు ఒడిశా బీచ్‌లే దిక్కు అయ్యాయి. సేద తీరేందుకు ఒడిశా వెళుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
-కె.గోవింద్‌రెడ్డి, వైద్యుడు, ఇచ్ఛాపురం
ప్రభుత్వానికి నివేదిక అందించాం
జిల్లాలో తీర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఇతర ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని ప్రత్యేక పరిగణగా తీసుకున్నాం. ఇచ్ఛాపురం మండలం నుంచి రణస్థలం మండలం వరకూ ఉన్న తీరంలో పర్యాటకాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించాం.
- నడిమింటి నారాయణరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి, శ్రీకాకుళం