Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధితులకు సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:06 PM
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో 16 మంది గాయపడ్డారని.. ముగ్గురు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. రెండు లక్షల సహాయం అందుతోందని చెప్పారు.
శ్రీకాకుళం, నవంబర్ 1: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి లోకేష్(Minister Lokesh) స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. తొక్కిసలాటలో 16 మంది గాయపడ్డారని.. ముగ్గురు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. రెండు లక్షల సహాయం అందుతోందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల సాయం చేస్తామని.. కేంద్రం తరఫున రూ. 50 వేల నుండి సహాయం అందుతోందని వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు. చనిపోయిన వారిలో టీడీపీకి చెందిన వారు కూడా ముగ్గురు ఉన్నారని.. వారికి ఇన్సూరెన్స్ రూ. ఐదు లక్షల అదనంగా వస్తుందని చెప్పారు. కాశీబుగ్గలోని ఘటనా స్థలితో పాటు, పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను లోకేష్ పరామర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈ గుడిని పాండా అనే 94 ఏళ్ల వయసు గల ఒక భక్తుడు ప్రజల కోసం కట్టించాడని చెప్పారు. భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడానికి గుడి కట్టాడని తెలిపారు. ఈ ఆలయాన్ని గత నాలుగైదు సంవత్సరాలుగా కడుతున్నారని.. 12 ఎకరాల్లో రూ.15 కోట్ల వరకు వెచ్చించారని చెప్పారు. ఆలయానికి ఈరోజు ఇంతమంది భక్తులు వస్తారని లోకల్ అధికారులు కానీ పోలీసులు గాని భావించలేదని చెప్పారు. ఈసారి ఎప్పుడూ లేనివిధంగా ఎక్కువమంది భక్తులు వచ్చారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు దర్శనం ఏర్పాటు చేశారని తెలిపారు. మూడు గంటల తర్వాత మళ్లీ గుడి తీయాలి కాబట్టి ఎంట్రీ మార్గం మూసేశారని చెప్పారు.
లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే సమయంలో.. బయట ఉన్న వాళ్ళ లోపలకి వెళ్లాలనుకుని ఒకేసారి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని మంత్రి వివరించారు. తమకు సమాచారం వచ్చిన వెంటనే మంత్రుల గ్రూపులో చూసి లోకల్ ఎమ్మెల్యే శిరీషతో మాట్లాడానని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు యుద్ధ ప్రాతిపదికన పని చేసామని అన్నారు. ఘటన తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం మాట్లాడిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు రాష్ట్రంలో ఉన్న గుడిల విషయంలో ఉన్న రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది సేకరించాలని ఆదేశాలిస్తున్నామని చెప్పారు.
టెక్నాలజీని వాడి క్రౌడ్ మేనేజ్మెంట్ ని కూడా మానిటింగ్ చేస్తామని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎండోమెంట్ గుడులకు ఒక మానిటరింగ్ ఉంటుందన్నారు. జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. సీఎం లండన్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. అధికారులు మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. పురోహితులు, పాండా గురించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ కింద ఉన్న ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలకు ఎస్ఓపీ ఏర్పాటు చేసి మంత్రుల కమిటీతో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Tirupati SP Subba Rayudu: తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ సుబ్బరాయుడు
AP Govt On Farmeres: రైతులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం