Share News

Raitanna Meekosam program: రైతన్నా.. మీ కోసం

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:25 AM

వ్యవసాయ రంగంలో పెనుమార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిసారించింది....

Raitanna Meekosam program: రైతన్నా.. మీ కోసం

  • అన్నదాత కోసం 24 నుంచి ప్రత్యేక కార్యక్రమం

  • సాగు బాగుకు పంచసూత్రాల అమలు: సీఎం

  • వారం పాటు రైతు ఇంటికి నేతలు, అధికారులు

  • అగ్రిటెక్‌పై అవగాహన కార్యక్రమాలు

  • 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు

  • శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు

  • ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం

  • పురుగుమందుల అధిక వాడకంతో జరిగే నష్టాలను వివరించాలి

  • సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ గురించీ చెప్పాలి

  • వ్యవసాయ అనుబంధ శాఖలకు సీఎం నిర్దేశం

  • మంత్రి అచ్చెన్న, అధికారులు, సిబ్బంది సహా 10 వేల మందితో టెలికాన్ఫరెన్స్‌

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో పెనుమార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా.. మీకోసం’ పేరిట పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికీ వెళ్తారు. వచ్చే నెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు. వీటిలో వ్యవసాయ- మార్కెటింగ్‌, అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడితో, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతుసేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేల మందితో సీఎం చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమానికి, సాగు విధానంలో తీసుకురావలసిన మార్పులపై ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందులో రైతు సేవా కేంద్రాల సిబ్బంది కీలక భూమిక పోషించాలన్నారు. ‘17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే ’పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ కింద దాదాపు 46.86 లక్షల రైతు కుటుంబాలకు రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో రూ.6,310 కోట్లు అందించాం. బిందు సేద్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. ’పొలం పిలుస్తోంది’ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నాం. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వాల మద్దతు అనే ఐదు అంశాలపై రైతులనే కాకుండా.. వారి కుటుంబాలనూ చైతన్యపరచాలి. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు, పాడి రైతులతో పాటు పౌల్ర్టీ, గొర్రెల పెంపకందారులకూ అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలి. దీంతో పాటు వర్క్‌షాపులు నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలి’ అని స్పష్టంచేశారు.


ప్రకృతి సేద్యంతో లాభాలను వివరించాలి..

రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేందుకు ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటవుతుంది ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌, ట్రేసబిలిటీ చేస్తున్నాం. రైతుబజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్‌ చేయాలి. కడపలో ప్రకృతి సాగును పరిశీలించాను. ఆ రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల కంటే గ్రోమోర్‌ కేంద్రాల్లో ఎరువుల ధర తక్కువగా ఉంది. రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గాలి. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే.. ఉత్పత్తులకు మేలు జరుగుతుంది. రైతులు ఏ పంట సాగు చేశారు.. వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి. సాగులో పురుగు మందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు అర్థమయ్యేలా స్పష్టంగా వివరించాలి. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలు, సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పాలి. పూర్తి నీటి యాజమాన్యం ద్వారా రిజర్వాయర్లను నింపగలిగాం. అలాగే సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలు రైతులకు చెప్పాలి’ అని ఆదేశించారు.

Updated Date - Nov 21 , 2025 | 04:25 AM