Railway Zone : రైల్వే జోన్ భవన పనులకు శ్రీకారం!
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:05 AM
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అధికారులు ముడసర్లోవలో 52 ఎకరాలు గత ఆగస్టులో రైల్వేశాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ భూమిలో మంగళవారం మట్టి పరీక్షలు చేపట్టారు.

కేటాయించిన భూమిలో మట్టి పరీక్షలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అధికారులు ముడసర్లోవలో 52 ఎకరాలు గత ఆగస్టులో రైల్వేశాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ భూమిలో మంగళవారం మట్టి పరీక్షలు చేపట్టారు. లేబొరేటరీ నుంచి నివేదిక వచ్చాక నిర్మాణం మొదలుపెట్టనున్నారు. గత నవంబరులోనే జోనల్ కార్యాలయం నిర్మాణానికి రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. అందులో జీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు ఉంటాయి. భవనంలో రెండు బేస్‌మెంట్లు (బీ1, బీ2 సెల్లార్లు), గ్రౌండ్ ఫ్లోర్, దానిపై మరో 9 అంతస్థులు ఉంటాయి. ఈ ప్రక్రియ ఇంకా ఖరారు దశలోనే ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. దీంతో గతనెల 8న ప్రధాని మోదీ విశాఖ వచ్చి రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోనల్ కార్యాలయ భవనం నిర్మాణానికి రైల్వేశాఖ 24 నెలలు గడువు విధించింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 జూన్‌కు పూర్తవుతుంది. అప్పటివరకూ జోన్ కార్యకలాపాలు ప్రారంభించకుండా ఉండడం అన్యాయమని, ప్రస్తుతం విశాఖలో ఉన్న రైల్వే భవనాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కాగా... మట్టి పరీక్ష పనులను పరిశీలించడానికి బీజేపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పరశురామరాజు పార్టీ నాయకులతో కలిసి మంగళవారం అక్కడకు వెళ్లారు. ఆయన వెంట కె.సతీశ్‌బాబు, మురళీమోహన్‌రాజు, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, మీనాక్షి, ఇతర నేతలు ఉన్నారు.