Share News

Somu Veerraju: శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు ఎంపిక

ABN , Publish Date - Nov 02 , 2025 | 07:33 PM

ఏపీ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Somu Veerraju: శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము  వీర్రాజు  ఎంపిక
BJP MLC Somu Veerraju

అమరావతి, నవంబర్ 02: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి ఒక సీటును కూటమి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పదవికి బీజేపీ సీనియర్ నేత పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేస్తారంటూ ఒక ప్రచారం అయితే తొలుత ఊపందుకుంది. కానీ చివరి నిమిషంలో సోము వీర్రాజు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎన్నికయ్యారు. ఇక శాసన మండలిలో వైసీపీ, టీడీపీకి ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. కానీ బీజేపీకి లేరు. దీంతో ఈ పదవికి సోము వీర్రాజును తాజాగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.


ఇక గతంలో అంటే 2014 అనంతరం సోము వీర్రాజు.. ఎమ్మెల్సీగా పని చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు. ఆ తర్వాత అంటే.. 2024 ఎన్నికలకు కొన్ని మాసాలకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇంతలో 2024 సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీ జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఈ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచి గెలిచారు. అటు ఎంపీగా.. ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

Updated Date - Nov 02 , 2025 | 07:34 PM