Somireddy Chandramohan Reddy:చాలా రోజులైపోయింది చూసి.. నిద్ర పట్టడం లేదు
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:02 PM
Somireddy Chandramohan Reddy: పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పరారీలో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్య బాణాలు సంధించారు.
నెల్లూరు, ఏప్రిల్ 18: పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అదృశ్యమైన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమతి ఇస్తామని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. కాకాణి గోవర్థన్ రెడ్డి ఆచూకీ చెబితే.. కరోనా ప్యాలెస్ బహుమతిగా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి.. తాను పెద్ద పుడింగినంటూ తొడలు కొట్టి .. ప్రస్తుతం భయంతో పిరికిపందలా పారిపోయాడని వ్యంగ్యంగా అన్నారు.
కరోనా ప్యాలెస్ గిఫ్ట్..
మొన్నటి దాకా కేసులకు అదరను, బెదరనని తొడగొట్టాడు.. ఇప్పుడేమో అడ్రస్ లేకుండా పోయాడని విమర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెప్పిన వారికి కరోనా ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇచ్చేద్దామనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫర్ వైసీపీ వాళ్లకు సైతం వర్తిస్తుందన్నారు. ఎవరైనా ముందుకు వచ్చి చెప్పండంటూ ఆ పార్టీ వాళ్లకు ఈ ఆఫర్ చేశారు.
పెద్ద పుడింగినని పెట్రేగిపోయాడు..
నెల్లూరులో పెద్ద పుడింగినని పెట్రేగిపోయాడని.. పోలీసుల దుస్తులూడదీస్తానని మాట్లాడాడన్నారు. కానీ ఇప్పుడు భయంతో వణికిపోతూ పిరికిపందలా పారిపోయాడని గుర్తు చేశారు. అంత భయపడే పిరికి పంద తొడలు కొట్టడమెందుకో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. 2016లో నకిలీ పత్రాలు తయారు చేసి రాత్రికి రాత్రే లుంగీ మీదే ఉడాయించాడంటూ ఎద్దేవా చేశారు.
రెండు నెలలు కనిపించ లేదని గుర్తు చేశారు. చివరకు సుప్రీంకోర్టులో కండీషన్ బెయిల్ పొంది.. రెండు నెలలపాటు ప్రతి రోజూ కానిస్టేబుల్ వద్ద కాకాణి గోవర్ధన్ రెడ్డి సంతకం పెట్టి వచ్చాడన్నారు. సిగ్గు,శరం లేకుండా వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ అరాచకాలు, అక్రమాలు, దోపిడీలతో చెలరేగిపోయాడంటూ కాకాణి వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. అవి కాకుండా మళ్లీ తమపై అక్రమ కేసులు బనాయించాడు... కాకాణి వాడిన భాష అత్యంత దారుణమన్నారు.
కిరణ్‌ను..
అయితే ఇటీవల కిరణ్ అనే వ్యక్తి.. జగన్ రెడ్డి కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడితే తమ ప్రభుత్వం ఉపేక్షించ లేదని గుర్తు చేశారు. అతడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో సైతం పెట్టించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు.
అలా అయితే.. జగన్‌కు నాలుగు సీట్లు పెరిగేవి..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొంచెమైనా మానవత్వం ఉండి ఉంటే వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడే ఆ పని చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను దూషించే వారిపై అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉంటే జగన్ రెడ్డికి మరో నాలుగు ఎమ్మెల్యే సీట్లయినా పెరిగి ఉండేవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
వెకిలి నవ్వులు నవ్వాడు..
అధికారంలో ఉన్నప్పుడు పనికి మాలిన గుణాలు ఉండే వారందరినీ వెనకేసుకొచ్చి వెకిలి నవ్వులు నవ్వాడు..ఇప్పుడు జైల్లో ఉండే వారిని పరామర్శిస్తూ వాళ్లు అందంగా ఉన్నారని.. వాళ్లకి బాడీలు భలే ఉన్నాయని.. పోలీసుల దుస్తులు ఊడదీస్తానని మాట్లాడుతున్నాడంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఒక సీఎం స్థానంలో పని చేసిన వ్యక్తిలా కాకుండా జగన్ రెడ్డి ఇంత దిగజారిపోతాడని తాము మాత్రం అనుకోలేదన్నారు. అలాగే మంత్రులుగా పని చేసిన వారు ఇలా పిరికిపందల్లా పారిపోతారని కూడా మేం ఊహించ లేదని చెప్పారు.
చూసి చాలా రోజులైపోయింది..
ఇంతకీ కాకాణి ఏ కలుగులో దాక్కున్నాడో.. ఆయనను చూసి చాలా రోజులైపోయిందంటూ ఆయన వ్యంగ్యగా అన్నారు. నిత్యం తనను తిడుతూ గడిపే వాడు...ఉదయం లేచినప్పటి నుంచి దడదడమంటూ నోటికొచ్చినట్టు తిట్టేవాడు.. అలాంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇన్ని రోజులు తనను తిట్టకుండా ఆయనకు రోజు ఎలా గడుస్తుందో అంటూ వ్యంగ్యంగా అన్నారు. కాకాణి తిట్టక పోయే సరికి తనకు నిద్రపట్టడం లేదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
For AndhraPradesh News And Telugu News