Ration Card Distribution: స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ!
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:34 AM
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు
చెన్నైలో ముద్రణ.. అక్కడి నుంచే నేరుగా మండలాలకు
25 నుంచి 31 వరకు లబ్ధిదారులకు పంపిణీకి ఏర్పాట్లు
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని క్యూఆర్ కోడ్‌తో ఆకర్షణీయంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నెల క్రితం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండరు ప్రక్రియ పూర్తిచేశారు. కార్డులు ప్రస్తుతం చెన్నైలో ముద్రణ దశలో ఉన్నాయి. పూర్తయిన కార్డులను ఎప్పటికప్పుడు అక్కడి నుంచే నేరుగా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచి 31వ తేదీ లోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్ కార్డులపై కూడా తమ పార్టీ రంగులు పులిమేసి.. వాటిపై ఒకవైపు జగన్ బొమ్మ, రెండో వైపు వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మను ముద్రించి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. గతంలో మాదిరిగా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన చేసింది. దీనిపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నంబర్, రేషన్‌షాపు నంబర్ తదితర వివరాలు ఉంటాయి. వెనుక వైపు మిగిలిన లబ్ధిదారుల వివరాలుంటాయి. సెప్టెంబరు నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులపైనే సరుకులు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే గత ఐదేళ్లలో కొత్తగా వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టిన నవదంపతులు, అర్హతలున్న పేదలు రేషన్ కార్డుల కోసం లక్షలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ దరఖాస్తులు మూలనపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హత ఉన్నవారందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతోపాటు తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారికి స్ప్లిట్ కార్డులు, ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఇందుకోసం గత మే నెలలో దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీని పూర్తి చేసింది. ఈ కసరత్తు పూర్తి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3,56,000 మంది రేషన్ లబ్ధిదారులు మరణించినట్లుగా గుర్తించారు. వారిని కార్డుల నుంచి తొలగించింది. మార్పులు, చేర్పుల కోసం 16,08,612 దరఖాస్తులు రాగా, వాటిలో 15,32,758 దరఖాస్తులను పరిష్కరించారు. కొత్తగా 9,08,644 మందిని సభ్యులుగా నమోదు చేశారు. వీరితో కలిపి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కు చేరింది. వీరంతా 1,45,97,486 కుటుంబాల్లో సభ్యులుగా ఉన్నారు.
ఏజెన్సీలో డిపోలు దూరంగా ఉంటే ఇంటికే రేషన్
69 మినీ రేషన్ డిపోల ఏర్పాటు: మంత్రి మనోహర్
గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారి ఇంటికే సరుకులు పంపిణీ చేపడతామని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రేషన్ డిపోలకు దూరంగా ఉన్న గ్రామాల్లోని లబ్ధిదారుల కోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా డిపోల్లో సరసమైన ధరకు నిత్యావసర సరుకులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని చెప్పారు.సోమవారం అల్లూరి జిల్లా పాడేరు మండలం మినుములూరు రేషన్ డిపోను, పాడేరులోని గోదామును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎండీయూ వ్యవస్థతో పోల్చితే ప్రస్తుత విధానంలోనే లబ్ధిదారులు స్వేచ్ఛగా రేషన్ సరుకులు పొందుతున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News