Andhra Liquor Scam: జగన్ మనిషి బాలాజీ
ABN , Publish Date - May 15 , 2025 | 02:58 AM
సిట్ దర్యాప్తులో బాలాజీ గోవిందప్ప వైసీపీకి అత్యంత దగ్గరైన వ్యక్తిగా, లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ఆయన అనేక ముడుపులు వసూలు చేసి, వాటిని కర్ణాటకలోని ప్రాపర్టీ మళ్లింపులో పాల్గొన్నట్లు సిట్ తెలిపింది.
కుటుంబానికి సన్నిహితుడు.. మద్యం స్కామ్‌లో కీలక పాత్ర
తరచూ రాజ్ కసిరెడ్డి ఆఫీసుకు.. ఖాళీ కారులో వచ్చి.. నోట్ల కట్టలతో వెనక్కి
ముడుపులతో కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాలు
‘అంతిమ లబ్ధిదారు’కు చేర్చడంలో కీలకం
వ్యక్తిగతంగానూ లాభపడ్డ బాలాజీ
రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన
20 వరకు రిమాండ్.. జైలుకు తరలింపు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నడిచిన వేలకోట్ల మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలిపింది. ఈ ‘సిండికేట్’లో ఆయన ముఖ్యమైన వ్యక్తి అని వెల్లడించింది. అంతేకాదు... బాలాజీ గోవిందప్ప ‘‘జగన్ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తి. అందువల్లే... ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు’’ అని స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా అటవీ ప్రాంతంలోని వెల్‌నెస్ సెంటర్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్న బాలాజీ గోవిందప్ప(ఏ-33)ను సిట్ అధికారులు బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టులో ఈ కేసుకు సంబంధించిన సంచలన అంశాలను ప్రస్తావించారు. ‘‘బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్లలో ఒకరు. సంస్థ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే వారు. భారతీ సిమెంట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాటి ఉన్నతస్థాయి వర్గాలతో బాలాజీకి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన లిక్కర్ స్కామ్‌లో ప్రధాన పాత్ర పోషించారు. లిక్కర్ సిండికేట్ తరఫున ముడుపులు తీసుకోవడంలో బాలాజీది కీలకంగా వ్యహరించారు. లిక్కర్ స్కామ్ పథక రచనలో ముఖ్య పాత్ర పోషించారు’’ అని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. రాజ్ కసిరెడ్డి(ఏ1)తో బాలాజీ తరచూ కీలక విషయాలు చర్చించేవారని, ఆయన కార్యాలయానికి ఖాళీ కారుతో వచ్చి మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపుల డబ్బులను నింపుకొని వెళ్లేవారని వివరించింది.

అలా కార్లలో తీసుకెళ్లిన కోట్లాది రూపాయలు షెల్ కంపెనీల్లోకీ, కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాల్లోకీ మళ్లించారని తెలిపింది. కమీషన్లు వసూలుచేసి అసలైన లబ్ధిదారుకు ఇవ్వడమే కాకుండా బాలాజీ కూడా వ్యక్తిగతంగా భారీగా లబ్ధి పొందినట్లు వెల్లడించింది. గత ఐదేళ్లలో భారీగా స్థిరాస్తులు, విలాసవంతమైన భవనాలు, కార్లు కొనుగోలు చేశారని వెల్లడించింది.
సిండికేట్‌గా దోపిడీ...
‘‘గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, మద్యం వ్యాపారస్తులు కలిసి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించారు. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన కుట్రదారుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బాలాజీ సన్నిహితంగా ఉండేవారు. పేరున్న లిక్కర్ బ్రాండ్లను అణచి వేయడం, ముడుపులు సమర్పించుకున్న ఊరూపేరూ లేని బ్రాండ్లను ప్రోత్సహించడంలో బాలాజీ కూడా కీలక భూమిక పోషించారు’’ అని సిట్ వెల్లడించింది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రతి దశలోనూ చురుకైన పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకూ 100 మందిని ప్రశ్నించామని, ప్రభుత్వ యంత్రాంగంలోని పలువురితో బాలాజీకి ఉన్న సంబంధాలు విచారణలో బయట పడ్డాయని సిట్ తెలిపింది. అందులో 25మందికి పైగా సాక్షుల వాంగ్మూలాల్లో బాలాజీ ప్రస్తావన వచ్చినట్లు పేర్కొంది. ఏపీఎ్‌సబీసీఎల్, మద్యం ఉత్పత్తి, సరఫరాదారులకు మధ్య జరిగిన కీలక సమావేశాల్లో బాలాజీ పాల్గొన్నట్లు సిట్ తెలిపింది. స్కామ్ రూపకల్పనలో ప్రారంభ దశ నుంచి అంతిమ లబ్ధిదారుకు ముడుపులు చేర్చే దాకా బాలాజీ పాత్ర ఉన్నట్లు వివరించింది. ఆయన అధికార దుర్వినియోగం చేశారని, ఆయన చర్యలు దురుద్దేశాలతో కూడుకున్నాయని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. మద్యం స్కామ్‌లో దర్యాప్తు మరింత లోతుగా సాగుతోందని, విచారణలో ఇవన్నీ కీలకం కానున్నందున బాలాజీ విదేశాలకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపింది. విచారణకు రమ్మని నోటీసు ఇచ్చినా ఖాతరు చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, దానివల్ల ఆయనను అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఎదురైందని కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపులు స్వీకరించిన పద్ధతులు, వాటి మళ్లింపు గురించి తెలియాల్సిన అవసరం ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. గోవిందప్పకు కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.
బినామీతో దందా
ధనుంజయ రెడ్డికి నీడలా శ్రీధర్
వెంటపట్టుకు రావాలని ‘సిట్’ ఆదేశం
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): తీగలాగితే... డొక కదులుతుంది! అలాగే... శ్రీధర్ అనే వ్యక్తి నోరు తెరిస్తే, లిక్కర్ స్కామ్ నిందితుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గుట్టురట్టవుతుందని ‘సిట్’ భావిస్తోంది. అందుకే... గురువారం విచారణకు శ్రీధర్‌ను కూడా తీసుకురావాలని ధనుంజయ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో... శ్రీధర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... శ్రీధర్‌ది రాయచోటి సమీపంలోని ఒక గ్రామం. ఆయన కొన్నేళ్లుగా ధనుంజయ రెడ్డికి నీడలా, నమ్మిన బంటులా వ్యవహరిస్తున్నారు. ధనుంజయ రెడ్డి తనకు సంబంధించిన అనేక ఆస్తులకు శ్రీధర్‌నే బినామీగా పెట్టినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలూ ఆయన పేరుతోనే నడిపిస్తున్నట్లు సమాచారం. తాడేపల్లి ప్యాలె్‌సతోపాటు సచివాలయానికి స్వేచ్ఛగా రాకపోకలు సాగించేంత చనువు ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News