Tirumala: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్టు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:59 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.

సిట్ అదుపులో ‘బోలేబాబా’ డైరెక్టర్లు
వైష్ణవి డెయిరీ సీఈవో, ఏఆర్ డెయిరీ ఎండీ కూడా
నలుగురికీ తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
రిమాండ్ విధింపు.. తిరుపతి సబ్‌జైలుకు తరలింపు
సిట్ అదుపులో 2 డెయిరీలకు చెందిన మరో
10 మందికిపైగా సిబ్బంది.. రేపో మాపో అరెస్టు?
ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు
అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా
అమరావతి/తిరుపతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్.. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్(45), పోమిల్ జైన్(47).. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్(69)ను అరెస్టు చేసింది. కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నలుగురినీ ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో వున్న సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8.20 గంటల సమయంలో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురినీ భారీ భద్రత నడుమ రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9.10 గంటలకు 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి.. నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
ఇదీ జరిగింది..
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్లు రిపోర్టుల్లో బట్టబయలు కావడం.. టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత ఏడాది సెప్టెంబరు 25న చేసిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ (470/2024) నమోదు చేయడం.. అనంతరం కూటమి ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించడం.. కలియుగ దైవంగా భాసిల్లే శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశవిదేశాల్లో ఆందోళనకు దారి తీయడం.. ఈ అంశం వివాదాస్పదమవడంతో సుప్రీంకోర్టు గత అక్టోబరు 4న సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు.. హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేశ్ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీసు శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి, భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నుంచి డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా సభ్యులు. నవంబరు 24న సిట్ దిగువ స్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబరు 13న సిట్ కీలక సభ్యులు రావడంతో విచారణ వేగం పుంజుకుంది. ఇన్ని రోజులూ దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ల లాగ్ బుక్కులు, ట్రిప్ షీట్లు, ట్యాంకర్ల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం, డెయిరీల సిబ్బంది నుంచి సేకరించిన వివరాలను సిట్ బృందం లోతుగా విశ్లేషించింది.
టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు పొందిన ఏఆర్ డెయిరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ బృందం నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలసి గత నాలుగు రోజులుగా ఏఆర్, వైష్ణవి డెయిరీలకు వెళ్లి యాజమాన్యాలను ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. కాగా.. ఆయా డెయిరీలకు చెందిన మరో పది మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు. వారిలో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి.. ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వారిని సోమ లేదా మంగళవారం అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు.. ఏఆర్, బోలేబాబా, వైష్ణవి డెయిరీల కార్యాలయాలతోపాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు.. తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు అంగీకరించడం వెనుక మతలబేంటి.. కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులెవరైనా సహకరించారా.. ఏ ధైర్యంతో ఇలా చేశారు.. ఎవరు అనుమతించారు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సిట్ ప్రస్తుతం నిమగ్నమైంది. రాజకీయపరమైన వ్యవహారాలు, అనధికారిక అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ కూపీ లాగుతోంది. ఆయా డెయిరీలకు అవకాశమిచ్చిన లేదా తెర వెనుక ఉండి కథ నడిపించిన కీలక వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉందని అంటున్నారు.
ఇంతకూ ఏ-1 ఎవరు?
ఈ కేసులో మొదటి నిందితుడు ఎవరన్నది అంతుబట్టడం లేదు. రిమాండ్ రిపోర్టులో రాజు రాజశేఖరన్‌ను ఏ-2గా, పోమిల్‌జైన్‌ను ఏ-3గా, విపిన్ జైన్‌ను ఏ-4గా, అపూర్వ చావ్దాను ఏ-5గా పేర్కొన్నా.. ప్రథమ నిందితుడి పేరును ప్రస్తావించలేదు. టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారుల్లో ఒకరు గానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి గానీ కావచ్చని తెలుస్తోంది.
చీకటి పడ్డాకా మహిళను అరెస్టు చేయవచ్చు
కారణాలు సహేతుకంగా ఉండాలి: మద్రాస్ హైకోర్టు
చెన్నై, ఫిబ్రవరి 9: చీకటి పడిన తరువాత కూడా మహిళలను అరెస్టు చేయవచ్చని, అయితే ఇందుకుగల హేతుబద్ధతను దర్యాప్తు అఽధికారి నిరూపించుకోవాల్సి ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయకూడదన్నది కేవలం మార్గదర్శనం చేసే సూచనలాంటిదని, చట్టబద్ధమైన నిబంధనేమీ కాదని తెలిపింది. దీన్ని ఉల్లంఘించినంత మాత్రాన అరెస్టు చట్టవిరుద్ధం కాబోదని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. రాత్రివేళ నిందితురాలిని అరెస్టు చేసిన మహిళా ఇన్‌స్పెక్టర్, మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. దీనిపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహిళా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను మాత్రం సమర్థించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి