NIA Investigation: మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్
ABN , Publish Date - May 27 , 2025 | 04:29 AM
దేశంలో భారీ పేలుళ్ల కోసం సిరాజ్ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువకులను మానవ బాంబులుగా ఉపయోగించాలనుకున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. విజయనగరం మొదటి టార్గెట్‌గా ఎంచుకుని పేలుళ్లకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ పథకం
డబ్బు ఆశ చూపి 12 మంది యువకులకు ఎర
పేలుళ్లకు విజయనగరమే తొలి టార్గెట్?
విచారణలో కీలక విషయాల గుర్తింపు
విజయనగరం/క్రైం, మే 26(ఆంధ్రజ్యోతి): దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ కుట్రలు పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక, నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాద ఉచ్చులోకి దించాడని ఎన్‌ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఇందుకోసం సిరాజ్, సమీర్‌లు సిగ్నల్ యాప్‌ను ఎంచుకున్నారు. ఇతర యాప్‌లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని.. అందుకే సిగ్నల్ యాప్‌ను ఎంచుకున్నట్లు విచారణలో వారు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్‌ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడని, ఇందుకోసం దేశంలో సుమారు 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. ఈ కోవలోనే 4వ రోజు సోమవారం విచారణ కొనసాగినట్లు సమాచారం.
స్లీపర్ సెల్స్‌గా 12 మంది?
12 మంది యువకులను స్లీపర్ సెల్స్‌గా ఏర్పాటు చేసి, వారిని మానవ బాంబులుగా పేల్చాలని సిరాజ్ పన్నాగం పన్నినట్లు తెలిసింది. దీనిపై సిరాజ్ నోరు విప్పాడని, దీంతో అధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అహిం గ్రూపు సభ్యుల కోసం దేశంలోని పలు నగరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. నేరస్థులను కలిసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సిరాజ్, సమీర్‌లకు ఆర్థిక, ఇతర సహకారం అందించిన వరంగల్‌కు చెందిన ఫర్షాన్ మొహిద్దీన్, యూపీకి చెందిన బాదర్, ఇమ్రాన్ అక్రమ్ కోసం కూడా వెతుకుతున్నారు. వీరి ఆడ్ర్‌సలు తప్పుగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అయితే వారు తమకు సిగ్నల్ యాప్‌లో పరిచయమని, చిరునామాలు తెలియదని సిరాజ్, సమీర్ బుకాయించినట్లు తెలిసింది.
పేలుళ్ల సామగ్రి ఎక్కడిది? ఇందుకు మీకు ఆర్థిక సాయం ఎవరు చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే సామగ్రి తయారీ ప్రదేశం ఎక్కడ? దాడులకు ఏఏ ప్రాంతాలను ఎంచుకున్నారు? విజయనగరానికి చెందిన నువ్వు.. బీహార్‌లో ఉన్న అబూతలేమ్ కలిసి ఏం పథక రచన చేశారు? అని కూడా సిరాజ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. విజయనగరంలోని కేఎల్ పురం, కన్యాకాపరమేశ్వరి ఆలయం వద్ద ఏ షాపుల్లో పేలుడు సామగ్రి తీసుకున్నారు? అనే ఆంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అంతేకాకుండా పలానచోట ఈ సామగ్రి దొరుకుతుందని సిరాజ్‌కు ఎవరు చెప్పారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం.
సిరాజ్ పేలుళ్లకు విజయనగరాన్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదటి పేలుడు హైదరాబాద్‌లో చేపట్టాలని సౌదీ హ్యాండ్లర్స్ చెప్పినట్లు సమాచారం. అయితే విజయనగరంలోనే పేల్చితే అహిం సంస్థకు పేరు వస్తుందని, హైదరాబాద్‌లో అయితే నిఘా సంస్థలతో ఇబ్బంది అని వారికి సిరాజ్ చెప్పినట్లు సమాచారం.
సిరాజ్ పాస్‌పోర్టు పొందే సమయంలో వెరిఫికేషన్‌కు సంబంధించి తండ్రి ఆజీజ్ రెహ్మాన్ ఏఎస్ఐ కావడంతో పెద్దగా విచారణ జరగలేదని తేలినట్లు సమాచారం. సిరాజ్, అతని కుటుంబసభ్యుల ఆస్తులు, బ్యాంక్ వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి కూపీ లాగుతున్నారని తెలిసింది.
మ్యాజిక్ లాంతర్ మర్మమేంటి?
సిగ్నల్ యాప్ ద్వారా తరుచూ ‘మ్యాజిక్ లాంతర్’ అంటూ చాటింగ్ చేసుకోవటం , మాట్లాడటం జరిగేదని దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. అసలు మ్యాజిక్ లాం తర్ అనేది కోడ్‌నా? లేదా ఓ ప్రాంతమా? లేదా అది కూడా ఓ వెబ్‌సైటా? అనేదానిపై సిరాజ్‌ను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై సిరాజ్ నోరు మెదపక పోవటంతో గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
సిరాజ్‌తో సీన్ రీ కన్‌స్ట్రక్షన్?
ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసు అధికారులు సిరాజ్‌ను తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీని ద్వారా విజయనగరంలో సిరాజ్ ఏఏ ప్రాంతాల్లో తిరిగాడు? ఏఏ కార్యకలాపాలు రూపొందించాడు? అన్న అంశాలపై మరిన్ని వివరాలను తెలుసుకోనున్నట్లు తెలిసింది. అలాగే విజయనగరంలో పేలుడుకు విజ్జీ స్టేడియంనే ఎందుకు ఎంచుకున్నారు? పేలుడు జరిపిన తర్వాత తప్పించుకునేందుకు అనుకూలమని భావించాడా? అనే కోణంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయించనున్నట్లు సమాచారం.