Simhachalam Shed Collapses: గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో అపశ్రుతి
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:59 AM
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ వేళ రెండు నెలల క్రితం గోడ కూలి ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన దుర్ఘటనను మరువకముందే శనివారం గిరి ప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది.
సింహాచలంలో నిర్మాణంలోనే కూలిన షెడ్
భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు
సింహాచలం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ వేళ రెండు నెలల క్రితం గోడ కూలి ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన దుర్ఘటనను మరువకముందే శనివారం గిరి ప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొనే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవ నిర్వాహణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండ దిగువన భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదర్శనకు శ్రీకారం చుట్టే తొలిపావంచా ప్రాంతంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు సుమారు రూ.6 లక్షల వ్యయంతో (జీఐ రేకులతో), కాంట్రాక్టరు ద్వారా షెడ్ నిర్మాణం చేపట్టారు.
శనివారం అక్కడ పనులు చేస్తున్న సమయంలో షెడ్‌కు జేసీబీ తగలడంతో కొంతభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షెడ్ నిర్మాణంలో వినియోగించిన పైపులు నిర్ణీత ప్రమాణంలో లేవని, జాయింట్ల వద్ద వేసే బోల్టులు కూడా తగిన సైజులు వాడలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న సింహాచల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి.త్రినాథరావు మీడియాతో మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.