Share News

Shivraj Singh Chauhan: ఏపీకీ మేనమామగా ఉంటా

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:52 AM

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల కలయిక ఉంగరంలో పొదిగిన రత్నం వంటిదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు....

Shivraj Singh Chauhan: ఏపీకీ మేనమామగా ఉంటా

  • రాష్ట్రం నం.1 అయ్యేందుకు సాయపడతా

  • మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లదిఉంగరంలో పొదిగిన రత్నం వంటి కలయిక

  • వారి కలయికే ఆంధ్రాకు శ్రీరామరక్ష

  • బాబు విజనరీ నేత..రేపటిపైనే ఆయన ఆలోచన

  • కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంస

  • చారిత్రక వెంగళాయపాలెం చెరువు వేదికగా పెమ్మసానితో కలిసి వాటర్‌ షెడ్‌ మహోత్సవ్‌కు శ్రీకారం

  • రాష్ట్రంలోని ఏడు చెరువు ప్రాజెక్టులకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతుల ప్రదానం

గుంటూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల కలయిక ఉంగరంలో పొదిగిన రత్నం వంటిదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. వీరి కలయిక రాష్ట్ర ప్రజల జీవిత స్థితిగతులను మారుస్తుందని, ఏపీని నం.1 స్థానంలో నిలుపుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మధ్యప్రదేశ్‌లో అందరూ నన్ను మామ అని పిలుస్తారు. నేను ఆ రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా మేనమామలా వ్యవహరిస్తూ కేంద్రం నుంచి అవసరమైన ఆర్థికసాయాన్ని తప్పక చేయిస్తాను. లఖ్‌పతి దీదీల పథకాన్ని సమర్థంగా అమలు చేయడం ద్వారా ఏపీని పూరిగుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.’’ అని చౌహాన్‌ వాగ్దానం చేశారు. మంగళవారం వాటర్‌ షెడ్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంగళాయపాలెం చెరువు వేదికగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. రూ.1.20 కోట్లతో 21 ఎకరాల్లో పునరుద్ధరించిన ఈ చెరువును శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరిశీలించి మొక్కలునాటి నీరు పోశారు. అనంతరం నల్లపాడు లయోలా పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో చౌహాన్‌ మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తారని, రాష్ట్ర ప్రజల సంతోషం, సంపద, ఆరోగ్యం గురించి తపన పడుతుంటారని ఆయన కొనియాడారు. ‘‘ప్రధానమంత్రి చొరవతో వాటర్‌ షెడ్‌ మహోత్సవ్‌ను ప్రారంభిస్తున్నాం. చెరువులతో ప్రజలను మమేకం చేసేందుకు వాటి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు, జిమ్‌లు, పిల్లల పార్కులు వంటివి వెంగళాయపాలెంలో వలే ఏర్పాటు చేసేలా చూడాల్సి ఉంది. ఇలాంటి బహుళావసర స్కీమ్‌తో ప్రజల ఆరోగ్యంతో పాటు మట్టికి కూడా సూక్ష్మపోషకాలు లభిస్తాయి’’ అని వివరించారు.


ఆ చెరువులకు ప్రోత్సాహకాలు

వాటర్‌ షెడ్‌ జన్‌ భగీరథ పథకం కింద చిత్తూరు జిల్లా చెరుకువారిపల్లి ప్రాజెక్టు, శ్రీ సత్యసాయి జిల్లా మర్రికొమ్మ దిన్ని ప్రాజెక్టు, గంగాలమ్మ చెరువు ప్రాజెక్టు; అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా తువ్వాపాడు ప్రాజెక్టు, మారెళ్ల ప్రాజెక్టు; విజయనగరం జిల్లా మెరకమూడియం చెరువు ప్రాజెక్టులకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి చెక్కులను ఆయాజిల్లాల అధికారులకు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అందజేశారు. అనంతపురం జిల్లా ఇవ్వేరులో పీఎం కృషి సంఛాయి యోజన 2.0 కింద వడికట్టడపు చెరువు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అన్నమయ్య జిల్లా గుండపల్లిలో రూ.3.12 లక్షలతో పునరుద్ధరించిన చెరువును ప్రారంభించారు. మిషన్‌ వాటర్‌ షెడ్‌ కింద కుప్పం నియోజకవర్గంలోని వడికట్టడపు చెరువును, ఇదే నియోజకవర్గంలోని కడవల్లి, రాళ్ల బుడుగుపాడులో మరో చెక్‌ డ్యాంను ప్రారంభించారు.

ఢిల్లీ వస్తే నా ఇంటికి రండి రాష్ట్ర ప్రజలకు చౌహాన్‌ ఆహ్వానం

ప్రజాప్రతినిధులు, అధికారులే కాదు...ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రజలు ఎవరు ఢిల్లీకి వచ్చినా తన ఇంటి (12, సఫ్దర్‌జంగ్‌ రోడ్డు) తలుపు తట్టొచ్చునని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. కాగా, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.500 కోట్లు కోరగా, అప్పటికప్పుడు రూ.380 కోట్లను చౌహాన్‌ మంజూరుచేశారు. ప్రజల కరతాళధ్వనుల మధ్య ఆ ఉత్తర్వుల ప్రతిని పెమ్మసానికి అందజేశారు.


తుఫాన్‌తో దెబ్బతిన్న ఏపీకి అండగా ఉంటాం..

మొంథా తుఫానుతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా ఉంటానని, కేంద్రం నుంచి తగిన న్యాయం జరగేలా చూస్తానని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్ప అభియాన్‌’ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశీయ ఉత్పత్తులను, దేశంలోని మేధో యువ శక్తిని ప్రోత్సమిస్తున్నామని తెలిపారు.

భూమి తల్లి...నీరు ఆయువు...: పెమ్మసాని

పల్లెలే దేశ ప్రగతికి పట్టుగొమ్మలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ‘‘భూమి తల్లి అయితే...నీరు ఆయువు లాంటిది. 25 శాతం భూమి ఈ దేశంలో వర్షంపై ఆధారపడింది. వర్షాలు కురవకపోతే సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసి రైతుల ఉత్పత్తి పెంచడానికి వాటర్‌షెడ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చాం. వెంగళాయపాలెం చెరువు వలే దేశంలో ఐదు వేల జనాభా కలిగిన 25 వేల గ్రామాల పరిధిలోని చెరువులను పునరుద్ధరించి నీటిని సంరక్షిస్తాం. పల్లె వెలుగు, గ్రామస్వరాజ్యం తెచ్చేవిధంగా కృషి చేస్తాం. జీఎ్‌సటీ సంస్కరణలతో ప్రతి పేదవాడికీ నెలకు రూ.1200 ఆదా అవుతోంది. జగన్‌ గురించి ఒక్క మాటే చెబుతా.. ‘‘వారి మందు కల్తీ, మాట కల్తీ, మనసు కల్తీ, పూర్తిగా మనిషే కల్తీ’’ అని విమర్శించారు.

Updated Date - Nov 12 , 2025 | 04:52 AM