Share News

Sharmila: ఫోన్‌ ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజం

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:29 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Sharmila: ఫోన్‌ ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజం

  • నా ఫోన్‌ రికార్డు ఆడియోను అప్పట్లో వైవీ వినిపించారు

  • కేటీఆర్‌, కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న సంబంధం ముందు

  • రక్తసంబంధం కూడా చిన్నబోయింది

  • చెల్లికి ఏ అన్నా చేయనన్నిఘోరాలు చేసిన జగన్‌

  • నన్ను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనివ్వకుండా కుట్రలు

  • ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి

  • విచారణకు పిలిస్తే హాజరవుతా: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

గోపాలపట్నం(విశాఖపట్నం), జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అల్లూరి జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఆమె విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి, రికార్డు చేసిన ఆడియోను వైవీ సుబ్బారెడ్డి స్వయంగా తనకు వినిపించారని తెలిపారు. అయితే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి చేసిన అరాచకాలకంటే ట్యాపింగ్‌ చిన్నదిగా అనిపించడంతో ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కేటీఆర్‌, కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న సంబంఽధం ముందు రక్తసంబంధం కూడా చిన్నబోయిందని ఆమె ఎద్దేవా చేశారు. తనను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా, భవిష్యత్తును నాశనం చేసేందుకు జగన్‌ ఎన్నో కుట్రలు చేశారని, అందులో ఫోన్‌ట్యాపింగ్‌ కూడా భాగమేనని షర్మిల పేర్కొన్నారు.


చెల్లి విషయంలో ఏ అన్నా చేయనన్నిఘోరాలు నా విషయంలో జగన్‌ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో జగన్‌కు సంబంధం లేకపోయినా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా ఊపిరి తీసుకోలేని స్థితికి చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్యాపింగ్‌ విషయంపై పోరాటం చేయలేకపోయానని తెలిపారు. తనకు జగన్‌తో వ్యక్తిగత కక్షలు ఉండి ఉంటే, ఎంవోయూ రాసిచ్చి, వాటిని అమలుచేయడం లేదని అప్పుడే ఫిర్యాదు చేసేదాన్నని, సొంత తల్లినే కోర్టుకు ఈడ్చిన వ్యక్తి జగన్‌ అని ఆమె విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రస్తుత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఎటువంటి విచారణకు పిలిచినా తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరారు. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 19 , 2025 | 04:29 AM