YS Sharmila: ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసానందం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:52 AM
జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయిన దృశ్యాలు భయానకమ ని ఆదివారం ఆమె ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
సింగయ్య మృతిపై మాజీ సీఎం జగన్‌ను నిలదీసిన షర్మిల
ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా?: షర్మిల
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తా రా? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షసానందం?’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మా జీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. మీ బలప్రదర్శనలు, హత్యలకు ఏం సమాధానం చెబుతార ని నిలదీశారు. జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయిన దృశ్యాలు భయానకమ ని ఆదివారం ఆమె ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉందన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగించడం ఏంటని, కారు సైడ్ బోర్డు మీద ఒక నాయకుడిగా కాన్వాయ్‌ను కదిలించడం సబబేనా? అని నిలదీశారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు.
పోలీసులు ఏం చేస్తున్నారు?
అసలు 100 మందికి పర్మిషన్ ఇస్తే.. వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? అని మండిపడ్డారు. బల ప్రదర్శనతో ఒక వ్యక్తి మృతికి జగన్ కారణమయ్యారని అన్నారు. 100 మందికి అనుమతి ఇస్తే వేలాది మందితో వచ్చిన జగన్‌ను నిలువరించకుండా ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. ‘పర్మిషన్‌కు వ్యతిరేకంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రేక్షకపాత్ర పోషించారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారు?’ అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? అని అడిగారు. కాంగ్రెస్ చేసే ఆందోళనలు, ధర్నాలకు హౌస్ అరెస్టులు చేసే పోలీసులు.. జగన్ విషయంలో ఎందుకు ఉదాశీనత పాటించారని ప్రశ్నించారు.