Share News

liquor scam: లిక్కర్‌ స్కాంలో రజత్‌ భార్గవ

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:50 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది.

liquor scam: లిక్కర్‌ స్కాంలో రజత్‌ భార్గవ

  • సీనియర్‌ ఐఏఎస్‌ పేరు వెలుగులోకి

  • పాలసీ రూపకల్పన నుంచి కమీషన్ల వసూలు వరకూ..

  • రాజ్‌ కసిరెడ్డికి పెత్తనం.. ముడుపులతో మౌనం

  • కీలక ఆధారాలు సేకరించిన ‘సిట్‌’

  • రేపు విచారణకు రావాలని నోటీసు అందజేత

  • అనంతరం చర్యలకు ఉపక్రమించే అవకాశం

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకూ ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజల్ని దోచుకొంటుంటే ఆయన చోద్యం చూశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డి(ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదు. అందుకు కారణాలు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. ఆయనెవరో కాదు జగన్‌ పాలనలో ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్‌ భార్గవ. కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజత్‌ భార్గవకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11న విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి విచారణకు రావాలని పేర్కొంది. లిక్కర్‌ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది? డిస్టిలరీస్‌ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు? రాజ్‌ కసిరెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటి? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనను ఎందుకు పట్టించుకోలేదు? సత్య ప్రసాద్‌ అనే ఒక ఎక్సైజ్‌ అధికారికి అన్నీ అప్పగించమని చెప్పిందెవరు? ఏ కొత్త బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్‌ ఇవ్వరాదన్న నిబంధనను ఆదాన్‌కు ఎందుకు వర్తింప చేయలేదు? మొదటి నెలలోనే 1.80లక్షల కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక గల కారణాలేంటి? రిటైల్‌ అవుట్‌లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్‌ కసిరెడ్డి ఆదేశాలతో సత్య ప్రసాద్‌ ద్వారా డిపో మేనేజర్లు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరి సిఫారసు మేరకు అనూషను ఎంఐఎస్‌ విభాగంలో నియమించారు? అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కోసం స్పెషల్‌ మెమో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె సైఫ్‌ అహ్మద్‌కు పంపితే రాజ్‌ కసిరెడ్డికి వివరాలు పంపి ముడుపులు సేకరించిన వైనం.. తదితరాలను సిట్‌ అధికారులు రజత్‌ భార్గవ ద్వారా వెలికి తీయబోతున్నారు. మద్యం ఉత్పత్తి, సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు? ఎవరు ఎంత తీసుకున్నారు? అనే విషయాలపై ప్రశ్నించబోతున్నట్లు తెలిసింది. వీటితో పాటు విధాన పరమైన నిర్ణయాలపై ప్రశ్నించి ఆయన ఇచ్చే సమాధానాల తర్వాత చట్టపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.

Updated Date - Jul 10 , 2025 | 04:50 AM