Share News

Saraswati Power dispute: ఆ కంపెనీ నాదే

ABN , Publish Date - May 31 , 2025 | 04:37 AM

సరస్వతి పవర్‌ కంపెనీలో వాటాల వివాదంపై జగన్‌, విజయలక్ష్మి ఎన్‌సీఎల్‌టీలో వాదనలు సమర్పించారు. జగన్‌ తనదే అసలైన హక్కు అంటుండగా, విజయలక్ష్మి పూర్తి హక్కుతో షేర్ల బదిలీ జరిగిందని వాదిస్తున్నారు.

Saraswati Power dispute: ఆ కంపెనీ నాదే

చెల్లికి వాటా ఇచ్చే ఉద్దేశం లేదు: జగన్‌

99.89 శాతం వాటా నా వద్దే: విజయలక్ష్మి

ఆమే మా యజమాని: సరస్వతి పవర్‌

కంపెనీలో తనకు వాటా లేదన్న షర్మిల

ట్రైబ్యునల్‌కు లిఖితపూర్వక వాదనలు

సమర్పణ.. విచారణ జూలై 11కి వాయిదా

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ కంపెనీలో వాటాలకు సంబంధించి మాజీ సీఎం జగన్‌, ఆయన తల్లి విజయలక్ష్మి తమ లిఖితపూర్వక వాదనలను హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు సమర్పించారు. ఈ కంపెనీ తన స్వార్జితమని జగన్‌ తన వాదనల్లో తెలిపారు. అందులో 51.01 శాతం వాటా తమదేనన్నారు. అయితే మొత్తం కంపెనీ తన అధీనంలో ఉందని.. 99.89 శాతం వాటా తన పేరిట ఎప్పుడో బదిలీ అయిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆమే తమ యజమాని అని.. బోర్డుకు ఎప్పుడో జగన్‌ రాజీనామా చేశారని సరస్వతి కంపెనీ యాజమాన్యం కూడా తెలిపింది. సరస్వతి పవర్‌లో షేర్ల బదిలీని నిలిపేయాలని.. తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీ.. ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దానిపై ఈ నెల 7న జరిగిన విచారణ సందర్భంగా అటు జగన్‌, ఆయన తల్లి, సంస్థ తరఫు న్యాయవాదులు పూర్తి స్థాయి వాదనలు వినిపించారు.

gk.jpg

లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు విచారణను ట్రైబ్యునల్‌ 30వ తేదీకి వాయిదావేసింది. శుక్రవారం బెంచ్‌లో ఒక సభ్యుడు సెలవులో ఉండడంతో తీర్పును రిజర్వు చేయలేదు. తదుపరి విచారణను జూలై 11కి వాయిదావేసింది.


ఇది తండ్రి సంపాదించిన ఆస్తి కాదు..: జగన్‌

సరస్వతి పవర్‌ తమ తండ్రి సంపాదించిన ఆస్తి కాదని జగన్‌ తన వాదనల్లో తెలిపారు. ‘చెల్లి షర్మిలపై ప్రేమ, అనురాగంతో ఆ కంపెనీలో మాకు ఉన్న 51 శాతం వాటా ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామనుకున్నాం. చెల్లి నాపై అనుమానంతో తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటాలు బదిలీ చేసుకోవాలని చూస్తోంది. ఎన్నికల సందర్భంగా వేరే పార్టీలో చేరి నాపై తీవ్ర విమర్శలు చేసింది. అందుకే ఆమెపై ప్రేమానురాగాలు పోయాయి. ఆమెకు సరస్వతి పవర్‌లో వాటా ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నాం. ఇది నా స్వార్జితం.. నేనే దాతను కాబట్టి ఏకపక్షంగా ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసే హక్కు ఉంటుంది. 51 శాతం షేర్ల సర్టిఫికెట్లు నావద్దే ఉన్నాయి. బహుమతి భౌతికంగా ఇవ్వనప్పుడు.. హక్కులు ఎలా బదిలీ అవుతాయి? జూలై 6వ తేదీ ఇండెమ్నిటీతో జూలై 2న బోర్డు నిర్ణయం తీసుకుందని తప్పుడు పత్రాలు సృష్టించి.. తల్లి, చెల్లి మోసం చేసి నా వాటా బదిలీ చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.


నిబంధనల ప్రకారమే షేర్ల బదిలీ: విజయలక్ష్మి

‘జగన్‌కు చెల్లిపై ప్రేమ తగ్గిందే తప్ప తల్లిగా నాపై ప్రేమ తగ్గిందని చెప్పలేదు. కంపెనీలో 99.89 శాతం వాటా నా వద్దే ఉంది. వంద శాతం కంపెనీ నాదే. కుటుంబ వ్యవహారాన్ని అనవసరంగా కోర్టుకు లాగారు. వివాదాస్పద అంశాలు ఉన్న ఈ వివాదాన్ని తేల్చాల్సింది ఎన్‌సీఎల్‌టీ కాదు.. సివిల్‌ కోర్టు. నిబంధనల ప్రకారమే నా పేరుపై షేర్ల బదిలీ జరిగింది. ఇందులో ఎలాంటి మోసం, కుట్ర లేవు. నా కొడుకు జగన్‌, నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం. అలాంటప్పుడు షేర్‌ సర్టిఫికెట్లు నా వద్ద లేవని ఎలా అంటారు? గిఫ్ట్‌ డీడ్‌, ఇతర అన్ని పత్రాలు పరిశీలించి అన్ని అంశాలపై కంపెనీ సంతృప్తి చెందిన తర్వాతే బదిలీ నమోదు జరిగింది’ అని విజయలక్ష్మి తన వాదనల్లో పేర్కొన్నారు. ఆమే తమ కంపెనీకి పూర్తి స్థాయి యజమాని అని సరస్వతి పవర్‌ వెల్లడించింది. ‘షేర్ల బదిలీ చట్టబద్ధంగా జరిగింది. బ్యాక్‌ డేట్‌తో పత్రాలు సృష్టించారనడం సమంజసం కాదు. గిఫ్ట్‌ డీడ్‌, ఎంవోయూ తర్వాత జగన్‌ ఎప్పుడో సరస్వతి పవర్‌ బోర్డుకు రాజీనామా వేశారు. వాటాలు వదులుకున్న తర్వాత కంపెనీకి సంబంధించినంత వరకు ఆయన సంబంధం లేని వ్యక్తి. మా కంపెనీ అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి ఆయనెవరు’ అని ప్రశ్నించింది. అసలీ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని.. కంపెనీలో తనకెలాంటి వాటా లేదని.. తనను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ట్రైబ్యునల్‌ను షర్మిల అభ్యర్థించారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 07:33 AM