Share News

Sankranti Effect: రిజర్వేషన్ల జోరు.. సంక్రాంతి కష్టాలు షురూ.!

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:16 PM

తెలుగు రాష్ట్రాల్లో సుమారు నెలన్నర ముందే సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ వేళ ఆయా ఊర్లకు వెళ్లడానికి ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకోవడమే ఇందుకు కారణం. దీంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 500 దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ఒక్కసారిగా ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి.

Sankranti Effect: రిజర్వేషన్ల జోరు.. సంక్రాంతి కష్టాలు షురూ.!
Sankranti festival rush

ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు.. తెలుగు ప్రజల్లో ఎక్కడలేని జోష్ వస్తుంది. ఇక ఏపీలో ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యమే వేరు. సంక్రాంతి ముగ్గులు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, పతంగులెగరేయటం వంటివి పోటాపోటీగా సాగుతుంటాయి. ఉపాధి నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లిన వారూ.. ఈ పండుగ కోసం సొంతూళ్లకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ సారి చాలాముందే ప్రయాణికులు తీవ్రంగా రవాణా కష్టాలను ఎదుర్కొంటున్నారు. బస్సులు, రైళ్లు సహా విమానాల్లోనూ రిజర్వేషన్లు దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్.. ఇదే అదనుగా భావించి విపరీతంగా ఛార్జీలను పెంచేస్తున్నాయి.


500 దాటిన వెయిటింగ్ లిస్ట్..

2026 జనవరి 14న సంక్రాంతి పండుగ. దానికి ముందు రోజు భోగి. అంతకముందు 10, 11వ తేదీన రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో.. 9వ తారీఖు నుంచే ప్రయాణికులు పోటీపడి టికెట్లు బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తై.. భారీగా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఈ వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 500 దాటేసింది. టికెట్ లభించే అవకాశం లేని మరికొన్ని రైళ్లలో 'రిగ్రెట్' అని కనిపిస్తోంది. బస్సుల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.


హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసాపురం, కాకినాడ, రాజమండ్రి మొదలగు ప్రముఖ ప్రదేశాలకు జనవరి 9-13 వరకు వెయిటింగ్ లిస్ట్ పూర్తైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, చిత్తూరుకు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌లో; జనవరి 10, 11న, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 10, 12న 'రిగ్రెట్' అని చూపిస్తోంది. వందేభారత్, గరీబ్‌రథ్ వంటి రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రైళ్లే కాకుండా బస్సుల్లోనూ ప్రయాణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఏపీ వైపు వెళ్లే చాలా బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు విపరీతంగా ఛార్జీలు పెంచాయి.


విమానాల్లోనూ..

ప్రయాణికుల తాకిడికి విమాన టికెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. జనవరి 10, 11న టికెట్ రేట్లు 50 శాతానికి పైగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి విమాన టికెట్ సుమారుగా రూ.4,600 నుంచి రూ.4,900 ఉంటుంది. కానీ, సంక్రాంతి వేళ రూ.7వేల నుంచి రూ.10వేలు దాటింది. వాస్తవానికి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు రైల్వే సంస్థ, ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసుల ద్వారా రద్దీని నియంత్రించాలి. కానీ ఆయా సంస్థలు ఇప్పటివరకూ ఇలాంటి చర్యలేవీ చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


ఇవీ చదవండి:

తల్లిపాలలో యురేనియం.. అధ్యయనాల్లో వెలుగుచూసిన నిజం

కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

Updated Date - Nov 23 , 2025 | 08:17 PM