YCP Sajjala: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతాం
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:23 AM
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బందే పెట్టే టీడీపీ నేతలు ఎవరినైనా సరే.. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జైల్లో పెట్టడం ఖాయమని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
రెడ్‌బుక్‌కు భయపడేది లేదు
కూటమి ఎమ్మెల్యేలను నిలదీయండి
వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు
సీఎం సహా సర్కారుకు బెదిరింపులు
బుక్కరాయసముద్రం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బందే పెట్టే టీడీపీ నేతలు ఎవరినైనా సరే.. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జైల్లో పెట్టడం ఖాయమని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వైసీపీ శింగనమల నియోజకవర్గ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... రాష్ట్రంలో పోలీసులకు చంద్రబాబు వైరస్ సోకిందని, అందుకే తప్పు చేయకపోయినా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
ఈ అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి లోకేశ్ అమలు చేస్తున్న రెడ్‌బుక్‌కు వైసీపీ భయపడదని తెలిపారు. వచ్చే నెల 2 నుంచి కూటమి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వస్తారని, ఏం చేశారని వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన ఎమ్మెల్యేలను, నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసాలను గుర్తు చేసేందుకు ‘రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో’ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.