Share News

MLC Ramgopal Reddy: ఆర్బీకేల్లో రూ.100 కోట్లు తినేశారు

ABN , Publish Date - May 06 , 2025 | 06:04 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల నిర్వహణ నిధుల్లో రూ.100 కోట్లకుపైగా అవినీతి జరిగింది. నిధులను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు దారిమళ్లించినట్టు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

MLC Ramgopal Reddy: ఆర్బీకేల్లో రూ.100 కోట్లు తినేశారు

గత ప్రభుత్వ పెద్దలు, ఏడీఏల చేతివాటం

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్లోకి రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)లూ చేరాయి. వైసీపీ గొప్పగా ఏర్పాటు చేశామని చెప్పుకొన్న ఆర్బీకేల నిర్వహణ నిధులూ దారి మళ్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఆర్బీకేకు నెలకు రూ.2,047 చొప్పున గత ప్రభుత్వం మంజూరు చేయగా.. ఆ శాఖ చూసిన ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై దోచేసుకున్నారు. ఈవిధంగా 10,778 ఆర్బీకేలకు నాలుగేళ్లలో విడుదలైన రూ.100 కోట్లకుపైగా సొమ్ము దుర్వినియోగమైనట్టు తెలిసింది. ఆర్బీకేల నిర్వహణకు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి, ఆ సొమ్మును దారిమళ్లించి, ఖర్చుల భారాన్ని మాత్రం గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులపై మోపారు. ప్రతి ఆర్బీకేలో స్వీపరుకు గౌరవ వేతనం, ఇంటర్నెట్‌, స్టేషనరీ ఖర్చుల నిమిత్తం రూ.2,047 ఇచ్చినట్లు లెక్కలు చూపారు. కానీ ఆ డబ్బులు క్షేత్రస్థాయికి పంపకుండా అధికారులు నొక్కేశారు. దీంతో గత్యంతరం లేక కొందరు వీఏఏలు ఆర్బీకే సేవల పేరుతో రైతుల నుంచి వసూళ్లు చేశారు. ఈవిధంగా నెలకు రూ.2,20,62,566 చొప్పున ఏడాదికి రూ.26.48కోట్లు నొక్కేశారు.


ఇందులో గత ప్రభుత్వంలో ఆ శాఖకు చెందిన వ్యక్తులకు వాటాలు వెళ్లినట్లు సమాచారం. 2020-24 మధ్య ఆర్బీకేల నిర్వహణ నిధుల్లో అవినీతి జరిగినట్లు తాజాగా ప్రజాప్రతినిధులు గుర్తించారు. దీనిపై విచారణ జరపాలని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 2024-25లో కూడా ఆర్బీకేల నిర్వహణ నిధులు వినియోగించుకున్నట్లు వ్యవసాయ శాఖ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద స్పష్టత ఇచ్చింది. ఈ నిధులన్నీ దుర్వినియోగం అయినట్టు తెలుస్తోంది.

Updated Date - May 06 , 2025 | 06:05 AM