Share News

Borugadda Anil : బెదురు లేకుండా మళ్లీ బొంకులు

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:58 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలకు పాల్పడిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌... పోలీసులు తనకోసం గాలిస్తున్న విషయం తెలుసుకుని తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

Borugadda Anil : బెదురు లేకుండా మళ్లీ బొంకులు

  • రౌడీ షీటర్‌ బోరుగడ్డ వీడియో విడుదల

  • తెలంగాణలో ఉన్నట్టు పోలీసుల అనుమానం

  • వైసీపీ నేతలు ఆశ్రయం ఇచ్చినట్టు సమాచారం

గుంటూరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలకు పాల్పడిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌... పోలీసులు తనకోసం గాలిస్తున్న విషయం తెలుసుకుని తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో దందాలు, దౌర్జన్యాలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించిన కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి బెయిల్‌ పొడిగింపు కోసం ఫోర్జరీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించిన విషయాన్ని దాచి ఆ వీడియోలో మొసలి కన్నీరు కార్చాడు. తన తల్లి కోసమే బెయిల్‌పై వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రాజ్యాంగబద్ధంగానే తనకు బెయిల్‌ వచ్చిందన్నాడు. తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, ఈ విషయంలో ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వాగతిస్తానని చెప్పుకొచ్చాడు. హైకోర్టుకు ఫోర్జరీ లెటర్‌ సమర్పించిన విషయాన్ని ప్రస్తావించకుండా ప్రజలను, మీడియాను, కోర్టులు, పోలీసులను సైతం తప్పుదారి పట్టించేలా వీడియో విడుదల చేశాడు. తన నైజాన్ని మరోసారి ప్రదర్శించి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆందోళన చెందుతున్నట్లు మాట్లాడాడు.


తనకు గానీ, తన కుటుంబానికి గానీ హాని జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్‌ బాధ్యత వహించాలన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న పోలీసులు బోరుగడ్డ వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జైలు నుంచి విడుదలయినప్పటి నుంచి బోరుగడ్డ ఎవరెవరిని కలిశాడు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వీడియోను ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అనేదానిపై ఆధారాలు ేసకరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టెక్నికల్‌ బృందం పూర్తిస్థాయిలో వివరాలు ేసకరిస్తోంది. తాను తల్లితో చెన్నైలోనే ఉన్నట్లు బోరుగడ్డ చెప్పినప్పటికీ ఆయన తెలంగాణలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు వైసీపీ నాయకులు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా పోలీసుల దృష్టికివచ్చింది. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు బోరుగడ్డ అనిల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సోమవారం హైకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్‌ ఫోర్జరీ సర్టిఫికెట్‌ సృష్టించిన అంశానికి సంబంధించి గుంటూరు పోలీసులు పూర్తి ఆధారాలతో నివేదిక రూపొందించి అనంతపురం పోలీసులకు అందజేశారు.

Updated Date - Mar 09 , 2025 | 03:58 AM