Share News

Borugadda Anil Kumar: బోరుగడ్డ లొంగుబాటు

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:40 AM

హైకోర్టు ఆగ్రహంతో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ దిగొచ్చాడు. విమానంలో వచ్చయినా మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో బుధవారం ఉదయాన్నే లొంగిపోయాడు.

Borugadda Anil Kumar: బోరుగడ్డ లొంగుబాటు

  • రాజమండ్రి జైలులో ఉదయాన్నే ప్రత్యక్షం.. వెంటనే గుంటూరుకు తరలింపు

  • జాప్యానికి కారణమడిగితే అనంత కోర్టులో ఆలస్యమైందని జవాబు

  • ఆధారాలు కోరడంతో హైకోర్టుకు చెబుతానన్న రౌడీ షీటర్‌?

  • గుంటూరులో బెయిల్‌ మంజూరుచేసిన మెజిస్ట్రేట్‌

  • తిరిగి రాజమండ్రి జైలుకు తరలింపు

  • అనంత కోర్టులో బోరుగడ్డకు దక్కని ఊరట

  • బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం

రాజమహేంద్రవరం/గుంటూరు/అనంతపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆగ్రహంతో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ దిగొచ్చాడు. విమానంలో వచ్చయినా మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో బుధవారం ఉదయాన్నే లొంగిపోయాడు. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపి.. నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సృష్టించి.. కోర్టును తప్పుదోవ పట్టించి.. మధ్యంతర బెయుల్‌ పొడిగింపు పొందిన అతడు.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 11న జైల్లో లొంగిపోవలసి ఉంది. కానీ రాలేదు. మధ్యంతర బెయిల్‌ పొడిగింపు మళ్లీ లభిస్తుందని ఆశించాడు. కానీ పొడిగించేది లేదని.. గడువులోగా లొంగిపోవలసిందేనని న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తేల్చిచెప్పారు. అయినా గడువులోగా జైల్లో లొంగిపోకపోవడంతో.. పరారీలో ఉన్నట్లు పోలీసులు పరిగణించారు. అయితే బుధవారం ఉదయం 6.14 గంటలకు బోరుగడ్డ అనూహ్యంగా జైలు వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయాన్ని అధికారులు రికార్డు చేసుకుని లోపలకు అనుమతించారు. గుంటూరు పట్టాభిపురం స్టేషన్లో నమోదైన కేసులో అతడిని కోర్టులో హాజరుపరచడానికి ఉదయం 7గంటలకు జైలుకు వచ్చారు. అతడిపై పీటీ వారెంటును అధికారులకు సమర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఉదయం 10.20కి అతడిని వారు అప్పగించగా గుంటూరుకు తరలించారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ స్పందన ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికారి అతడికి బెయిల్‌ మంజూరు చేశారు. బోరుగడ్డను తిరిగి పోలీసులు రాత్రి 9.50 గంటలకు రాజమండ్రి కారాగారానికి తరలించారు.


వివరణ కోరరేం?

బెయిల్‌ గడువు ముగిసిన తర్వాత లొంగుబాటుకు ఎందుకు ఆలస్యమైందో వివరణ ఇవ్వాలంటూ జైలు అధికారులు బోరుగడ్డకు నోటీసు ఇవ్వకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణంగా గడువు ముగిసిన తర్వాత ఒక గంట వరకు మానవతా దృక్పథంతో ఖైదీలకు అనుమతిస్తారు. అయినా ఆలస్యంపై రాతపూర్వకంగా వివరణ తీసుకుంటారు. దానిపై సూపరింటెండెంట్‌ సంతృప్తి చెందకపోతే ములాఖత్‌లలో కోతపెట్టడం వంటి చర్యలుంటాయి. బోరుగడ్డ 12.30గంటలు ఆలస్యంగా వచ్చినా నోటీసు జారీచేసి వివరణ కోరలేదు. దీనిపై రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ స్పందించారు. ‘ఆలస్యంపై బోరుగడ్డను ప్రశ్నించాం. అనంతపురం కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యమైందన్నాడు. అందుకు ఆధారం అడిగితే హైకోర్టుకు చెబుతామన్నాడు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశాం. అలాగే పోలీసులకు రేడియో మెసేజ్‌ ఇచ్చాం. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.


బోరుగడ్డకు బెయిల్‌ నిరాకరణ

బోరుగడ్డకు అనంతపురం ఎక్సైజ్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని దూషించినందుకు అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. బెయిల్‌ కోసం బోరుగడ్డ కోర్టును ఆశ్రయించగా.. న్యాయాధికారి అతడి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.


బోరుగడ్డకు అండగా సీనియర్‌ ఐపీఎస్‌?

  • కూటమిలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా!!

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు పాల్పడడం.. ప్రైవేటు సెటిల్మెంట్లు చేయడం.. రాజకీయ ప్రత్యర్థులను బూతులతో దూషించడం.. అరెస్టయ్యాక పోలీసులతో సపర్యలు చేయించుకోవడం.. చివరకు హైకోర్టును సైతం నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌తో తప్పుదోవ పట్టించి మధ్యంతర బెయిల్‌ పొడిగించుకోవడం.. వంటి చర్యలకు పాల్పడిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా.. తనను అనంతపురం జైలులో కాకుండా తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని అతడు ఎందుకు కోరాడన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సాయంతో రాజమహేంద్రవరం జైలుకు చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధికి ఎన్నికల ముందు బోరుగడ్డ కొంత ఫండ్‌ ఇచ్చాడని.. ఇప్పుడాయన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అతడి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. కాగా.. రాజమహేంద్రవరం జైలులో బోరుగడ్డ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో పోలీసులు దృష్టి సారించారు. హైకోర్టుకు నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌ చూపించి మధ్యంతర బెయిల్‌ పొడిగింపు పొందాక.. అతడు ఎవరెవరిని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడో కూడా గుట్టుగా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వాటన్నిటినీ క్రోడీకరించుకున్నాక బోరుగడ్డపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని యోచిస్తున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 03:40 AM