AP Ration Dealers: సరుకుల పంపిణీ బాధ్యతలు తిరిగి డీలర్లకు అప్పగించాలి
ABN , Publish Date - May 20 , 2025 | 06:57 AM
రేషన్ సరుకుల పంపిణీ బాధ్యతలు మళ్లీ డీలర్లకు అప్పగించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. విలేజ్ మాల్స్‌కు సంబంధించి జీవో 5ను అమలు చేసి డీలర్ల ఆదాయాన్ని పెంచాలన్నారు.
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరుకుల పంపిణీ బాధ్యతలను తిరిగి చౌక ధరల దుకాణాల డీలర్లకే అప్పగించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. డీలర్లకు ఆదాయం పెంచేలా రేషన్ షాపుల్లోనే విలేజ్ మాల్స్ ఏర్పాటుకు సంబంధించిన జీవో 5ను అమలు చేయాలని సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి విరుద్ధంగా ఎండీయూ వ్యవస్థను తీసుకువచ్చి రేషన్ డీలర్లకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని 29,500 మంది రేషన్ డీలర్లు తమ ఉనికిని కోల్పోయారని పేర్కొన్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఆత్మగౌరవంతో జీవిస్తూ కుటుంబాలను పోషించుకునేవారని తెలిపారు. ప్రతి ఏటా సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా అందించడం వల్ల ఐదేళ్లలో రూ. 80 కోట్ల మేర రేషన్ డీలర్లు లబ్ధి పొందారని వివరించారు.