Ration Shop: క్యూఆర్ కోడ్‌తో రేషన్ అక్రమాలకు చెక్
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:08 AM
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలపై సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతి దుకాణం వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లు
ఏమైనా అవకతవకలుంటే.. మొబైల్‌తో స్కాన్ చేసి క్షణాల్లో ఫిర్యాదు చేయవచ్చు
సరుకుల నాణ్యతపై అభిప్రాయాలు చెప్పొచ్చు
పరిష్కారం చూపనున్న అధికారులు
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలపై సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీని పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేలా, సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రతి రేషన్ షాపు వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేసింది.
దీని ద్వారా సరుకుల పంపిణీపై కార్డుదారులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. షాపు వద్ద ఉన్న ఆ క్యూఆర్ కోడ్‌ను తమ మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి క్షణాల్లోనే ఫిర్యాదు చేయవచ్చు. కోడ్‌ను స్కాన్ చేయగానే.. ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా? సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా? రేషన్ డీలరు సరైన తూకంతోనే సరుకులు ఇచ్చారా? అధిక ధరలు వసూలు చేశారా? డీలరు మీతో మర్యాదగానే వ్యవహరించారా? వంటి ప్రశ్నలతో వెబ్‌ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు అవును లేదా కాదు అని సమాధానాలు ఇస్తే చాలు.. కార్డుదారుల ఫిర్యాదులు లేదా అభిప్రాయాలు నేరుగా సంబంధిత ఉన్నతాధికారులకు చేరతాయి. తద్వారా వారు ఆ ఫిర్యాదులు పరిష్కరిస్తారు.
‘పౌర’ సేవల మెరుగు కోసమే: నాదెండ్ల
‘‘ప్రజల భాగస్వామ్యంతో ‘పౌర’ సేవల్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ‘ఇంటింటికీ రేషన్’ పేరుతో పంపిణీ చేసిన దానికన్నా.. గత నెలలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించిన తర్వాత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే వారి ఇంటికెళ్లి సరుకులు అందించే విధానం ప్రారంభమైంది. మిగిలిన కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ జూలై 1 నుంచి 15 వరకు కొనసాగుతుంది.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చు. అక్రమాలకు తావు లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకే ప్రతి రేషన్ షాపు దగ్గర క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేయించాం. కార్డుదారులు తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు, స్పందన తెలియజేస్తూ ఈ వ్యవస్థలో భాగస్వాములవ్వాలి’’ అని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.