Share News

Petrol Bunk Abuse: అర్ధనగ్నంగా చేసి.. స్తంభానికి కట్టేసి..

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:48 AM

శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మండలంలోని పెట్రోల్ బంకులో పంప్ బాయ్ ఫకృద్దీన్‌ను నిర్వాహకులు అర్ధనగ్నంగా చేసి స్తంభానికి కట్టేసి హింసించారు. పోలీసులు మేనేజర్, ఇతర ఉద్యోగులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Petrol Bunk Abuse: అర్ధనగ్నంగా చేసి.. స్తంభానికి కట్టేసి..

పెట్రోల్‌ పంప్‌ బాయ్‌ని చితకబాదిన వైనం

వైసీపీ నేత బంకులో దాష్టీకం

అమ్మకం డబ్బులు తక్కువగా ఇచ్చాడని నెపం

శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన

కదిరి, మే 31(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంకులో పంప్‌ బాయ్‌గా పనిచేసే యువకుడిని నిర్వాహకులు చిత్రహింసలు పెట్టారు. అర్ధనగ్నంగా చేసి, స్తంభానికి కట్టేయడంతో పాటు చితకబాదారు. వైసీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్‌ కుటుంబం ఈ పెట్రోల్‌ బంక్‌ను నిర్వహిస్తోంది. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన బాబాఫకృద్దీన్‌ కొన్ని రోజులక్రితం అక్కడ పంప్‌ బాయ్‌గా చేరాడు. శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని నగదు అప్పగించాడు. అందులో రూ.24 వేలు తక్కువ ఉందని మేనేజర్‌, ఇతర ఉద్యోగులు ఫకృద్దీన్‌ను చితకబాదారు. దుస్తులు లేకుండా చేసి, బంకు వద్ద ఉన్న స్తంభానికి చైన్లతో కట్టేశారు. కదిలేందుకు వీల్లేకుండా చేతులు వెనక్కి, కాళ్లను స్తంభానికి కట్టేశారు. సుమారు 2-3 గంటలపాటు బహిరంగంగా హింసించారు. అతని బంఽధువులు వచ్చి నిర్వాహకులను నిలదీసినా వెనక్కి తగ్గలేదు. బాధితుడిని తీసుకెళ్లి ఓ గదిలో పడేశారు. విషయం తెలుసుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకుని విచారించారు. గదిలో ఉన్న ఫకృద్దీన్‌ను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మేనేజర్‌, ఇతర ఉద్యోగులను కూడా స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమ యజమాని చెబితేనే ఇలా చేశామని, ఏమైనా ఉంటే వారితోనే మాట్లాడుకోవాలని వారు సమాధానం చెప్పారు.


నలుగురిపై కేసు నమోదు

ఫకృద్దీన్‌పై దాడి చేసినందుకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ సత్యనారాయణ, పంప్‌ బాయ్‌లు అమర్‌నాథ్‌, మాబు, హరికృష్ణను నిందితులుగా చేర్చారు. బంక్‌ నిర్వహిస్తున్న వైసీపీ నాయకుడు బత్తల హరిప్రసాద్‌, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:48 AM