CM Chandrababu: పులివెందుల.. అరాచకం నుంచి బయటపడుతోంది
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:06 AM
పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని సీఎం చంద్రబాబు..
ప్రజలు ధైర్యంగా ఓట్లేశారు
తానెప్పుడూ చేసే అరాచకాలు జరగలేదనేజగన్‌లో అసహనం: చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కాసేపు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘పులివెందులలో ఎప్పుడూ తాను చేసే అరాచకాలు ఈసారి జరగలేదని జగన్ అసహనంతో ఉన్నారు. వైఎస్ హయాం నుంచీ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల నుంచి 11 మంది నామినేషన్లు వేసే పరిస్థితికి తీసుకొచ్చాం. శాంతిభద్రతల నిర్వహణ పటిష్ఠంగా జరిగింది కాబట్టే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు’ అని తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 17 శాతం లోటు ఉందన్నారు.
పదవులు రాలేదని నిరాశపడొద్దు: లోకేశ్
మంత్రి లోకేశ్ కూడా కాసేపు మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పదవులు రాని ఆశావహులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పులివెందులలో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడిందని, ఎప్పుడూ బలవంతపు ఏకగ్రీవం జరిగే చోట విచిత్రంగా సరిగ్గా 11 మంది పోటీలో నిలబడ్డారని అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు.