Share News

వైసీపీ ఖాళీ

ABN , Publish Date - Feb 26 , 2025 | 02:19 AM

జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీలో ఉన్న 24మంది కార్పొరేటర్లలో 20మంది మంగళవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో చేరడం అందుకు నిదర్శనం.

వైసీపీ ఖాళీ
పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిన అనంతరం మాజీ మంత్రి బాలినేనితో వైసీపీ కార్పొరేటర్లు

బాలినేని వెంట జనసేనలో చేరిన 20మంది ఒంగోలు కార్పొరేటర్లు

ఫలించని అధినేత జగన్‌ ప్రయత్నాలు

ప్లీనరీలో ఇతరత్రా నాయకులు చేరే అవకాశం?

నియోజకవర్గాలవారీ ప్రణాళికలు రూపొందిస్తున్న కూటమి నేతలు

ఒంగోలు కార్పొరేషన్‌లో నాలుగుకు పడిపోయిన వైసీపీ సభ్యుల బలం

జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీలో ఉన్న 24మంది కార్పొరేటర్లలో 20మంది మంగళవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో చేరడం అందుకు నిదర్శనం. ఇప్పటికే జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జనసేనలో కూడా చేరికలు పెరిగిపోవడం వైసీపీకి ఊహించని షాక్‌గా చెప్పుకోవచ్చు. అటు టీడీపీ, ఇటు జనసేనలో మరికొందరు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భయంతోనే వైసీపీ అధినేత జగన్‌ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను ఉద్దేశించి మెడలో కండువాను మర్చిపోయారా.. మార్చేయాలనుకున్నారా? అని వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి అనూహ్య విజయం లభించడంతో పార్టీల మార్పు ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల్లో వైసీపీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టే విధంగా టీడీపీ నాయకులు ముందుకు కదిలారు. ఒంగోలు, కార్పొరేషన్‌, గిద్దలూరు మునిసిపాలి టీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, అశోక్‌రెడ్డి.. మేయర్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చేర్చుకొని ఆపార్టీ పెత్తనానికి గండికొట్టారు. ఇటీవల మార్కాపురం మునిసిపాలి టీలో కూడా 12మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక మండల పరిషత్‌లలో వైసీపీకి గండిపడే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. త్రిపురాంతకం మండల పరిషత్‌లో టీడీపీ అభ్యర్థి పాగా వేయడం అందుకు నిదర్శనం. జిల్లా పరిషత్‌పై సైతం టీడీపీ నాయకులు దృష్టిపెట్టారు. జడ్పీ, ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కొంత కాలపరిమితి అడ్డంగా మారడంతో వేచిచూస్తున్నారు. జడ్పీని కాపాడుకునేందుకు వైసీపీ నాయకులు టీడీపీలో ఒక కీలక ఎమ్మెల్యేతో రహస్య ఒప్పందానికి వచ్చినట్లు అధిష్ఠానానికి ఫిర్యాదు అందింది. దానిపై మంత్రి నారా లోకేష్‌ సీరియస్‌ అయినట్లు కూడా తెలిసింది. దీంతో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ను అదను చూసి చేజిక్కించుకునే విధంగా టీడీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు.

కలిసి వస్తున్న జనసేనలో చేరికలు

ఈనేపథ్యంలో జనసేనలోకి కిందిస్ధాయి ప్రజాప్రతినిధులు చేరడం జిల్లాలో కూటమి ప్రభుత్వానికి కలిసివస్తోంది. కీలకమైన ఒంగోలు కార్పొరేషన్‌లో ఇప్పటికే మేయర్‌తోపాటు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 25కు చేరింది. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో వైసీపీ నుంచి 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దీంతో కార్పొరేషన్‌లో కేవలం నలుగురు మాత్రమే వైసీపీకి మిగిలారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో టీడీపీ పక్షాన 25మంది, జనసేన పక్షాన 21మంది, వైసీపీ పక్షాన నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఇక మిగిలిన నలుగురు కూడా వివిధ కారణాలతో పార్టీ మారకపోయినా కీలకమైన సమయంలో మీరు చెప్పిన విధంగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వైసీపీ ఒంగోలులో ఖాళీ అయినట్లే.


సర్వశక్తులు ఒడ్డినా..

జిల్లాలో బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఆయనతోపాటు వైసీపీ నాయకులు పార్టీని వీడకుండా కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డారు. ఆ పార్టీ లోక్‌సభ ఇన్‌చార్జి భాస్కర్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు జిల్లా అంతా సమావేశాలు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కుమారుడైన ఎమ్మెల్యే బూచేపల్లిని పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. వారి ద్వారా విందులు, వినోదాలు ఇతరత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పార్టీశ్రేణులను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. పరిస్ధితి శ్రుతిమించటంతో జగనే స్వయంగా రంగంలో దిగి జిల్లాలోని ముఖ్య నాయకులతో పలుమార్లు సమావేశమయ్యారు. బాలినేని ప్రాతినిధ్యం వహించే ఒంగోలు నియోజకవర్గంలో అయితే కార్పొరేటర్లు, ముఖ్య నాయకులందరినీ జగనే పిలిపించుకొని వారికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల కార్పొరేటర్లు గ్రానైట్‌తో అనుబంధం ఉన్న వారిని పార్టీ మారితే తస్మాత్‌ జాగ్రత్త అనే హెచ్చరికలు ఇచ్చారు ఇంకోవైపు ఇతరత్రా వ్యాపార భాగస్వాములకు కూడా కొందరు నేతల నుంచి హెచ్చరికలు అందాయి. అయినా 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులు వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరటం విశేషం. కాగా ఒంగోలుతోపాటు ఇతరత్రా నియోజకవర్గాల నుంచి కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులు బాలినేని సమక్షంలో జనసేనలో చేరేందుకు సిద్ధమైప్పటికీ ఆ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీ టీడీపీ నాయకత్వంతో ఇబ్బంది లేని విధంగా వైసీపీకి చెందిన వారిని జనసేనలో చేర్చుకోవాలని భావించినట్లు సమాచారం. తదనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని జనసేన అధినేత నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బాలినేని కూడా ఇప్పటికే జిల్లాలోని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో టచ్‌లోకి వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో జనసేనలో చేరే నాయకుల విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో మున్ముందు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా మంగళవారం బాలినేని తన కుమారుడైన ప్రణీత్‌రెడ్డిని కూడా పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేర్చారు. గత ఎన్నికల్లో తాను ఇక పోటీ చేయనని భవిష్యత్తులో తన కుమారుడే రంగంలో ఉంటాడని చెప్పిన బాలినేని ఆ విషయాన్ని జనసేనానికి చెప్పి కుమారుడిని చేర్చినట్లు అని కూడా తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2025 | 02:49 AM