Share News

వైసీపీ నాయకులు బురద జల్లడం మానుకోవాలి

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:19 PM

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పంచాయతీలు, మండలాలు అభివృద్ధిబాటలో పయనిస్తుంటే చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండల టీడీపీ నాయకులు చెప్పారు.

వైసీపీ నాయకులు బురద జల్లడం మానుకోవాలి
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మార్కాపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పంచాయతీలు, మండలాలు అభివృద్ధిబాటలో పయనిస్తుంటే చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండల టీడీపీ నాయకులు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వక ఉత్సవ విగ్రహాల్లా మారాయన్నారు. వలంటరీ వ్యవస్థతో సర్పంచ్‌ల అధికారులను నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే పెద్దారవీడు మండల పరిధిలోని 19 పంచాయతీల్లో రూ.6 కోట్ల నిధులతో గ్రామాల్లో సిమెంటు, తారురోడ్లను నిర్మించామన్నారు. పాడి పరిశ్రమ కింద ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో గోకులం షెడ్లకు రూ.55 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఏనుగులదిన్నెపాడు గ్రామంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల మంజూరైందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండి ంగ్‌ బిల్లులు ఉన్నాయంటూ ప్రస్తుతం విడుదలైన నిధుల్ని స్వాహా చేసేందుకు వైసీపీ సర్పంచ్‌లు అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. చివరికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నకిలీ పట్టాల ద్వారా భూములు స్వాహా చేయడం, ప్రభుత్వ భవనాల నిర్మాణాల వద్ద మెటీరియల్‌ను కూడా దొంగతనం చేయడం వైసీపీ నాయకులకే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జలసిరి, జల్‌జీవన్‌ మిషన్‌ల ద్వారా ఒక్క పనైనా పూర్తిచేశారా అని నిలదీశారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని మసలుకోవాలని హితవుపలికారు.

విలేకరుల సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ కన్వీనర్‌ గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీపీ వెన్నా వెంకటరెడ్డి, తిరుమలరెడ్డి చిన్నవెంకటరెడ్డి, ఆకుమల్ల శ్రీనివాసరెడ్డి, తోకల యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 11:19 PM