గ్రామ సర్వేయర్లపై పని ఒత్తిడి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:29 PM
: గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయం లేమి కారణంగా ఏ రోజు ఏ పనిచేయాలో కూడా తెలియనిపరిస్థితి ఏర్పడింది. ఏ రోజుకారోజు ఆయా శాఖల అధికారులు లక్ష్యాలను నిర్దేశిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామసచివాలయ పరిధిలో పనిచేస్తున్న సర్వేయర్లపై పంచాయతీరాజ్, రెవెన్యూ, సర్వేశాఖ ఉన్నతాధికారులు లక్ష్యాలను నిర్దేస్తుండటంతో ఏ శాఖ పని ముందు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

మూడుశాఖల మధ్య నలిగిపోతున్న వైనం
ఏ శాఖ పనులు ముందు చేయాలో తెలియక గందరగోళం
సమస్య పరిష్కారం కోసంచొరవచూపని అధికారులు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయం లేమి కారణంగా ఏ రోజు ఏ పనిచేయాలో కూడా తెలియనిపరిస్థితి ఏర్పడింది. ఏ రోజుకారోజు ఆయా శాఖల అధికారులు లక్ష్యాలను నిర్దేశిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామసచివాలయ పరిధిలో పనిచేస్తున్న సర్వేయర్లపై పంచాయతీరాజ్, రెవెన్యూ, సర్వేశాఖ ఉన్నతాధికారులు లక్ష్యాలను నిర్దేస్తుండటంతో ఏ శాఖ పని ముందు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
రైతులకు మేలు చేకూర్చేందుకు ఇటీవల రెవెన్యూ సదస్సులు నిర్వహించి గత భూసర్వేలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తులతోపాటు గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేయాలని మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఒత్తిడి పెంచారు.
గ్రామ సర్వేయర్లకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తుండటంతో తమ శాఖకు సంబంధించిన పలు రకాల పనులను నిర్దేశిస్తున్నారు.
సర్వేశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ సర్వేయర్లకు తమ నిర్దేశాలను ఇస్తున్నారు.
ఇలా ఏ శాఖ అఽధికారులు ఆ శాఖ అధికారులు తమ లక్ష్యాలను ఇస్తుండటంతో ఏ శాఖ పని ముందు చేయాలో, ఏ శాఖ పని వెనుకచేయాలో తెలియడం లేదు.
మూడు శాఖలు చెప్పే పనులివీ..
పంచాయతీరాజ్‌శాఖ ద్వారా డోర్ టుడోర్ ట్యాకింగ్(మ్యాపింగ్), ఆధార్‌లింక్, బ్యాంకు అప్‌డేట్ చేయడం, హౌస్ ట్యాక్స్ సర్వేనెంబరు లింక్, పంచాయతీ భూముల సంరక్షణ వంటి పనులు త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తుండగా రెవెన్యూశాఖ ద్వారా గ్రామాల్లో ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల పరిష్కారంతోపాటు రీ సర్వే, స్టోన్లు ఎరైజింగ్(పేరు తొలగింపు) వంటి పనులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇంకొక వైపు సర్వేశాఖ ద్వారా ప్రతిరోజూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించి ఆపనులు పూర్తి చేసి సాయంత్రంలోపు నివేదికలు పంపాలని ఆదేశిస్తున్నారు.
మండల స్థాయి సర్వేయర్‌తో...
మండల స్థాయిలో సర్వేయర్ ఉన్నందున అతని ద్వారా ఏ రోజుకారోజు ఒక శాఖ పని చేయించడం ద్వారా పని సులభంగా ఉంటుందని కొందరు చెప్తున్నారు. ఆ దిశగా మండల స్థాయిలో నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆయా శాఖలకు ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్ర స్థాయి సర్వేయర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. దీని వల్ల గ్రామాల్లో సర్వేయర్లు ఏ పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది.
పనిభారంతో సెలవులు
గ్రామాల్లో పనిచేసే సర్వేయర్లు ఆయా శాఖల అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలేక, ఆ సమాచారం మండల స్థాయి అధికారులకు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. పనిభారం భరించలేక కొంత మంది అనారోగ్య పరిస్థితులను సాకుగా చూపి సెలవులు పెడుతున్నారు. సర్వేయర్లు ఏ రోజు పని ఆరోజు చేసేందుకు మూడుశాఖల మధ్య సమన్వయం లేని కారణంగానే ఈపరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
మండల సర్వేయర్ పరిధిలోకి తీసుకురావాలి
నాళం వెంకటేశ్వర్లు, సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గ్రామాల్లో పనిచేసే సర్వేయర్లను మండల సర్వేయర్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా గ్రామాల్లో పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మూడు శాఖలు లక్ష్యాలు ఇస్తుండటంతో ఏ శాఖ పనిచేయాలో అర్థం కాక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. పనిభారం తగ్గించేందుకు కొంత వెసులుబాటు కూడా కల్పించాలి.