కలప దొంగలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:01 AM
మండ లంలోని చెరుకూరు చెరువులో దొంగలు పడ్డారు. కలపను అక్రమంగా అమ్ముకుని పెద్దఎత్తున డబ్బులు స్వాహా చేశారు. దీనిపై చెరువు పరిధిలోని గ్రామాలకు చెందిన కొందరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవ హారంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు నర్రా తిరుపతినాయుడి పాత్ర ఉందని వారు ఆరోపించారు.

చెరుకూరు చెరువులో తుమ్మ, చిల్లచెట్లు అక్రమంగా నరికివేత
రూ.43లక్షలకు అమ్మకం
పంచాయతీకి రూపాయి కూడా జమ చేయని వైనం
ఆర్డీవోకు ప్రజల ఫిర్యాదు
సాగునీటి సంఘం అధ్యక్షుడి పాత్ర ఉందని ఆరోపణ
పొన్నలూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని చెరుకూరు చెరువులో దొంగలు పడ్డారు. కలపను అక్రమంగా అమ్ముకుని పెద్దఎత్తున డబ్బులు స్వాహా చేశారు. దీనిపై చెరువు పరిధిలోని గ్రామాలకు చెందిన కొందరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవ హారంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు నర్రా తిరుపతినాయుడి పాత్ర ఉందని వారు ఆరోపించారు. అందిన సమాచారం మేరకు.. చెరుకూరులోని సర్వే నంబర్ 674లో 284 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. అందులో తుమ్మ, చిల్లచెట్లు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు అధికారికంగా అటవీ, ఇరిగేషన్ శాఖ అనుమతులతో గ్రామ పంచాయతీ తరఫున బహిరంగ వేలం పాట నిర్వహించి, అధిక ధరకు పాడుకున్న వారికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ అదేమీ జరగలేదు. తాజాగా చెరువుకు ఏర్పడిన సాగునీటి సంఘం బాధ్యుడు చెరువులోని చెట్లను లోపాయికారీగా దాదాపు రూ.43 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. పంచాయతీకి మాత్రం రూపాయి కూడా జమ చేయలేదు. ఆ మొత్తం కలప వాస్తవ విలువ రూ.60లక్షలకుపైనే ఉంటుందని అంచనా. దీనిపై చెరువు పరిధిలోని రామన్నపాలెంతోపాటు చెరుకూరు, వెంకుపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చెట్లు విక్రయించడానికి వెంకుపాలెం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేకుండా నీటిసంఘం అధ్యక్షుడు ఏకపక్షంగా అమ్ముకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని ఆయన స్వాహా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై చెరువు పరిధిలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్‌బాబు, దాచర్ల నరసింగరావు తదితరులు కనిగిరి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.