Share News

ఉపాధి సిబ్బందిపై కొరడా

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:02 PM

ఉపాధి హామీ పథకం పనులను పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడిని ఉద్యోగులపై వేటు పడింది. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ డ్వామా పీడీ జి.జోసెఫ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులు రిజిస్టరు పోస్టు ద్వారా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి.

ఉపాధి సిబ్బందిపై కొరడా

అవినీతికి పాల్పడినవారిని సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు

రిజిస్టరు పోస్టు ద్వారా కార్యాలయానికి ..

పూర్వ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు షోకాజ్‌ నోటీసులు

పీసీపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనులను పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడిని ఉద్యోగులపై వేటు పడింది. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ డ్వామా పీడీ జి.జోసెఫ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులు రిజిస్టరు పోస్టు ద్వారా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి. మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 549 పనులకు 11.95 కోట్లు, పంచాయతీరాజ్‌ పనులకు సంబంధించి 22పనులకు 1.25కోట్లు మొత్తం 12.26కోట్లు ఖర్చుచేశారు. ఈ పనులకు సంబంధించి సెప్టెంబరులో సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మండలంలో చేపట్టిన ఉపాధి పనులలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

సామాజిక తనిఖీ అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆడిట్‌ బృందం అధికారుల ఎదుట నివేదికలను వెల్లడించారు. మండలంలో 328పనులకు సంబంధించి రూ.61.77లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. ఈ అక్రమాలలో ఏపీవో సుబ్బారావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ షరీఫ్‌, టీఏలు వీరాంజనేయరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వై.శేఖర్‌ కిషోర్‌, వెంకటేశ్వర్లుతో పాటు ఈసీ సత్యనారాయణను బాధ్యులను చేస్తూ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించడంతోపాటు నేరుగా తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని పీడీ జోసెఫ్‌కుమార్‌ నోటీసులు పంపించారు. ఎంపీడీవో కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చిన ఈ నోటీసులను సస్పెండ్‌ అయున ఉద్యోగులు అందుకున్నారు. కాగా ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగిన సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లుగా పనిచేసిన 18మందికి వారిపై నమోదైన అభియోగాలకు వివరణ ఇవ్వడంతో పాటు రికవరీ చెల్లించాలని షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Updated Date - Jan 06 , 2025 | 11:02 PM