Share News

పోలీస్‌,, శభాష్‌!

ABN , Publish Date - Jan 21 , 2025 | 01:42 AM

మార్కాపురం పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెండు మాసాలుగా మిరప కోతలు ఉధృతంగా సాగుతుండడంతో పట్టణం నుంచి కూలీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆటోల్లో పరిమితికి మంచి ఎక్కి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

పోలీస్‌,, శభాష్‌!
మిరప కోతకు వెళ్లే కూలీలను ఆర్టీసీ బస్సులో ఎక్కిస్తున్న పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులు

మార్కాపురంలో వినూత్న ప్రయోగం

ప్రమాదాల నివారణకు కూలీలను ఆర్టీసీ బస్సుల్లో తరలింపు

మార్కాపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెండు మాసాలుగా మిరప కోతలు ఉధృతంగా సాగుతుండడంతో పట్టణం నుంచి కూలీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆటోల్లో పరిమితికి మంచి ఎక్కి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పలువురు మృత్యువాతపడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు నడుం బిగించారు. నాలుగు రోజులుగా పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. డ్రైవర్లు, కూలీలను తరలించే మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు వాహనాల్లో పరిమితికి లోబడి కూలీలను తరలించాలంటే ఇబ్బందులు తప్పవని డ్రైవర్లు, మేస్త్రీలు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సుల ప్రతిపాదనను పోలీసులు వారికి వివరించారు. ఉదయం మార్కాపురం నుంచి పనిచేసే గ్రామానికి చేర్చడం మళ్లీ సాయంత్రం గమ్యస్థానానికి తీసుకువచ్చేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అఽధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో కూలీలను తరలించడానికి మార్గం సుగమమైంది.

ఎనిమిది బస్సుల్లో కూలీల తరలింపు

మార్కాపురం నుంచి మిరప, పొగాకు కోతలకు వెళ్లే కూలీలకు పలు ప్రాంతాల్లో సోమవారం 8 బస్సులను ఆర్టీసీ డీఎం నరసింహులు ఏర్పాటు చేశారు. స్థానిక కళాశాల రోడ్డు, తర్లుపాడు రోడ్డు, శ్రీనివాస థియేటర్‌, కోమటి కుంటల నుంచి 8 బస్సుల్లో కూలీలను తరలించారు. మార్కాపురం సీఐ పి.సుబ్బారావు అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ప్రైవేటు వాహనాల్లో కూలీలు ఎక్కకుండా నిఘా ఏర్పాటు చేశారు. రవాణాశాఖ నుంచి ఎంవీఐ మాధవరావు, ఆర్టీసీ డీఎం నరసింహులు దగ్గరుండి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. కోమిటికుంట వద్ద కూలీలను బస్సుల్లో ఎక్కించే క్రమంలో రెండు అప్పీ ఆటోల్లో కూలీలను తరలిస్తుండటాన్ని గుర్తించి వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేయించారు. అదేవిధంగా ఆయా కూలీలను అక్కడ నుంచి పని ప్రదేశానికి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించారు. ఈ సీజన్‌ ముగిసే వరకు ఆర్టీసీ బస్సులు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని కూలీలకు తెలిపారు. కార్యక్రమంలో టౌన్‌, రూరల్‌ ఎస్సైలు సైదుబాబు, అంకమ్మరావు, పోలీసు, రవాణాశాఖ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశాల మేరకు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Updated Date - Jan 21 , 2025 | 01:42 AM