Share News

జంగాలపల్లి నుంచి వాటర్‌షెడ్‌ యాత్ర

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:49 AM

నీటి సంరక్షణ పనులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్వామా ద్వారా అమలయ్యే వాటర్‌షెడ్‌ పనులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల అభివృద్ధి పనులను గ్రామానికి కనీసం ఒక్కటైనా చేపట్టాలని భావించాయి.

జంగాలపల్లి నుంచి వాటర్‌షెడ్‌ యాత్ర

ఇక్కడి నుంచే రాష్ట్రస్థాయి కార్యక్రమం

జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ప్రారంభం

ఒంగోలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : నీటి సంరక్షణ పనులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్వామా ద్వారా అమలయ్యే వాటర్‌షెడ్‌ పనులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల అభివృద్ధి పనులను గ్రామానికి కనీసం ఒక్కటైనా చేపట్టాలని భావించాయి. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి సంరక్షణ పనులు భారీగా చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన వాటర్‌ హెడ్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రచార రథాలను ఏర్పాటు చేసి వాటర్‌షెడ్‌ పథకం అమలు చేసే ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక ప్రచార రథాన్ని ఏర్పాటుచేయగా ఢిల్లీలో ఆ కార్యక్రమాన్ని బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిజ్‌సింగ్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. తదనుగుణంగా ఆయా రాష్ట్రాలలో స్థానికంగా కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు.

పండుగ వాతావరణంలో..

రాష్ట్రంలో ప్రచారరథం కార్యక్రమాన్ని జిల్లా నుంచి చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందుకు కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం మురగమ్మి పంచాయతీలోని జంగాలపల్లిని ఎంపిక చేశారు. అక్కడ వాటర్‌షెడ్‌ కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేసి ఉండగా ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ప్రచారరథాన్ని ప్రారంభించేలా డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఉపాధి పథకం డైరెక్టర్‌ షణ్మక్‌ తదితరులు పాల్గొనున్నారు. కాగా ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రారంభించే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేసి అనంతరం రాష్ట్రస్థాయి ప్రచార రథాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

Updated Date - Feb 05 , 2025 | 01:49 AM