సాగర్ ఆయకట్టుకు నీటి గండం
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:49 AM
ఉమ్మడి జిల్లాలోని సాగర్ ఆయకట్టు భూములకు నీటి గండం పొంచి ఉంది. పంట ఉత్పత్తులు చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో మరో నెలన్నరపాటు పుష్కలంగా నీరు అవసరం ఉంది. ఆమేరకు సాగర్ నుంచి సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఉమ్మడి జిల్లాలో 2లక్షల ఎకరాల్లో పైర్లు
కీలక దశలో వరి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న
మరో రెండు, మూడు తడులు తప్పనిసరి
15 టీఎంసీలకుపైగా నీరు అవసరం
సగం కూడా ఇచ్చే అవకాశం లేని పరిస్థితి
వర్షాల వేళ నీరిచ్చి ఇప్పుడు నియంత్రణ
భారీగా నష్టపోనున్న రైతులు
ఉమ్మడి జిల్లాలోని సాగర్ ఆయకట్టు భూములకు నీటి గండం పొంచి ఉంది. పంట ఉత్పత్తులు చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో మరో నెలన్నరపాటు పుష్కలంగా నీరు అవసరం ఉంది. ఆమేరకు సాగర్ నుంచి సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న వంటి పైర్లు కీలక దశలో ఉన్నాయి. అవి చేతికి రావాలంటే కనీసం 15 నుంచి 18 టీఎంసీల నీరు అవసరమని అంచనా. అయితే మార్చి ఆఖరులోపు అందులో సగం కూడా వస్తుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. అంతగా పొలాల్లో పైర్లు లేని వేళ గత సెప్టెంబరు నుంచి డిసెంబర్ వరకు నీటిని ఇచ్చి ప్రస్తుతం అవసరమైన సమయంలో సరఫరాపై నియంత్రణ పెట్టారు. ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడం, అంతకు మించి రాష్ట్ర విభజన వల్ల సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి వాడకంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం తలెత్తుతున్న వివాదాలు ప్రస్తుతం నీటి ఇక్కట్లకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఒంగోలు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ప్రధాన సాగు నీటి వనరు సాగర్ కుడి కాలువ. ఒంగోలు కేంద్రంగా ఉన్న జలవనరుల శాఖ సర్కిల్‌లో సుమారు 4.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఎన్నెస్పీ పరిధిలో ఉంది. అందులో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో లక్షా 72వేల ఎకరాలు ఉండగా మిగిలిన సుమారు 2.71 లక్షలు ప్రకాశం జిల్లాలో ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 4.43 లక్షల ఎకరాలలో దీర్ఘకాలంగా నీరు అందని సుమారు లక్ష ఎకరాల చివరి భూముల రైతులు ఎప్పటి నుంచే సాగర్ నీరు ఆధారంగా పంటల సాగు మానేశారు. మిగిలిన 3.50 లక్షల ఎకరాలలో 45శాతం మాగాణి, 55శాతం ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం, వరిసాగు అంత లాభసాటిగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది.
ఇప్పటికే వాటా నీరు రాక..
అధికారవర్గాల సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో సాగర్ ఆయకట్టులో 2.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో 48 వేల ఎకరాల్లో మాగాణి కాగా, మరో లక్ష 92వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు ఉన్నాయి. ఆరుతడి పంటలలో అత్యధికంగా పొగాకు, మిర్చి, వైట్‌బర్లీ, మొక్కజొన్న వంటివి ఉన్నాయి. సాగర్ కుడి కాలువకు డ్యాం నుంచి 132 టీఎంసీల నీటి వాటా ఉండగా అందులో ఉమ్మడి జిల్లాకు 43శాతం వంతున 57 టీఎంసీలు సరఫరా కావాలి. ఆ ప్రకారం ఇప్పటికే 57 టీఎంసీల నీరు ఉమ్మడి జిల్లాకు వచ్చింది. అయితే పంటల సాగుకు నీరు అంతగా అవసరం లేని సెప్టెంబరు నుంచి నవంబరు వరకు అధికంగా నీరు సరఫరా చేశారు. అప్పట్లో శ్రీశైలం, సాగర్ డ్యాంలు నిండి గేట్లు ఎత్తి సముద్రానికి ఎక్కువగా నీటిని వదిలారు. ఆసమయంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు స్థానికంగా పంటలకు నీరు అవసరం అంతగా లేకున్నా కాలువలకు నీరు ఇవ్వడంతో చెరువులు, కుంటలు, వాగుల్లో ప్రవాహం జోరుగా సాగింది.
అందుబాటులో ఉంది 46టీఎంసీలే
గతంలో డ్యాంల గేట్లు ఎత్తి నీటిని వదిలే సమయంలో కాలువలకు విడుదల చేసే వాటిని రాష్ట్ర నీటి కోటా లెక్కల్లోకి తీసుకోకూడదన్న అనధికారిక ఒప్పందం రెండు రాష్ట్రాల మధ్య ఉండేది. అలాగే భావించి ఈ ఏడాది నీటిని సెప్టెంబరు సమయంలో ఇచ్చారు. అయితే ప్రస్తుతం సాగర్ డ్యాంలో నీటి నిల్వ తగ్గింది. ఇప్పుడు డ్యాంలో 178 టీఎంసీలు మాత్రమే ఉండగా డెడ్‌స్టోరేజీ 132 టీఎంసీలు పోను రెండు రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కలిపి 46 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి తోడు ఆంధ్ర రాష్ట్రం భారీగా సాగర్ నీటిని తోడేస్తున్నదని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో నీటి వాడకం లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)పై ఒత్తిడి తెస్తోంది. దీంతో ఏపీకి అధికారికంగా 132 టీఎంసీలు వాడుకునే హక్కు ఉండగా ఇప్పటికే ఆ కోటా వాడినట్లు లెక్కలు కట్టారు. ఆ ప్రభావం ప్రస్తుత సీజన్‌లో పొలంలో ఉన్న పంటలకు తదుపరి నీటి సరఫరాపై తీవ్రంగా పడింది. కేఆర్‌ఎంబీపై తెలంగాణ ఒత్తిడితో మన రాష్ట్రానికి ఇక పెద్దగా సాగర్ నీరు సరఫరా కాకపోవచ్చన్న సంకేతాలు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఇరిగేషన్ అధికారులకు అందాయి. మార్చి ఆఖరు వరకు అతి తక్కువ నీరు మాత్రమే వస్తుందని, అందుకనుగుణంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు అందాయి. దీంతో ఆ ప్రకారం కసరత్తును ప్రస్తుతం ఇక్కడి అఽధికారులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పొలంలో ఉన్న పంటల నీటి అవసరాలను పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాకు మార్చి ఆఖరులోపు కనీసం 15నుంచి 18 టీఎంసీల నీరు అవసరం. అయితే అందులో సగానికి మించి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈఏడాది జిల్లాలో ప్రత్యేకించి రామతీర్థం దిగువ ప్రాంతంలోని ఎస్‌ఎన్‌పాడు, కొండపి, ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50వేల ఎకరాల్లో పొగాకు లేత తోటలు ఉన్నాయి. వాటికి కనీసం మూడు తడుల నీరు అవసరం ఉంది.
వారబందీ అమలుకు ఆదేశం
రామతీర్థం నుంచి దర్శితోపాటు వైపాలెం నియోజకవర్గాలలోని పలు గ్రామాల్లో మిర్చి, వరి, మొక్కజొన్న ఉండగా బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో మిర్చి, మొక్కజొన్న, బర్లీ పొగాకు అధికంగా ఉంది. వీటన్నింటికీ దాదాపు రెండు మాసాలు నీరు అవసరం. పలుచోట్ల శనగ పంటకు కూడా తడులు అందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ ప్రకారం 15 నుంచి 18 టీఎంసీల నీరు అవసరం కనిపిస్తుండగా 8 టీఎంసీలు మించి ఇచ్చే అవకాశం లేదన్న సంకేతాలు ఉన్నతస్థాయి నుంచి జిల్లా అధికారులకు అందాయి. ఆ మేరకు వారబందీ అమలు, ఇతర నీటి నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏమి చేయాలన్నది అర్థంకాక ఇక్కడ ఇరిగేషన్ అధికారులు తలల పట్టుకుంటున్నారు. నీటి నియంత్రణఫై ఇప్పటికే కలెక్టర్ అన్సారియా రెండు రోజుల క్రితం సమీక్ష చేయగా శనివారం ప్రాజెక్టుల సీఈ జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. అయితే అవసరానికి సరిపడా నీరు సరఫరా అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఏదైనా అకాల వర్షం పడితే తప్ప రైతులకు నీటిగండం తప్పేటట్లు లేదు.