Share News

రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:30 PM

కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రక్రియను సక్రమంగా సాగలేదు. దరఖాస్తులు చేసుకున్న ఆరు నెలల తర్వాత కొత్తకార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపన చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్‌ కార్డులు లేని ప్రజల్లో ఆశలు చిగురించాయి.

రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు

మీసేవా కేంద్రాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు

సాఫ్ట్‌వేర్‌లో సమస్యతో జాప్యం

త్వరలోనే దరఖాస్తులు

స్వీకరిస్తామంటున్న అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రక్రియను సక్రమంగా సాగలేదు. దరఖాస్తులు చేసుకున్న ఆరు నెలల తర్వాత కొత్తకార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపన చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్‌ కార్డులు లేని ప్రజల్లో ఆశలు చిగురించాయి. అందుకు అనుగునంగా నూతన సంవత్సరం కానుకగా కొత్త రేషన్‌ కార్డుల జారీతోపాటు చేర్పులు, మార్పులకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఉత్పన్నమైన కొన్ని సమస్యలతో ఆ ప్రక్రియ చేపట్టడంలో జాప్యమవుతోంది. విషయం తెలియని ప్రజలు రేషన్‌ కార్డుల కోసం మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. వాటి నిర్వాహకులు ఇంకా సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చెప్పి పంపుతున్నారు.

అధికారులకు పెద్దఎత్తున అర్జీలు

ప్రభుత్వ పథకాలకు రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండటంతో కొత్తవి కోరుతూ మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్‌లో ప్రజలు పెద్దఎత్తున అర్జీలు ఇస్తున్నారు. రెండేళ్ల నుంచి రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అందుకోసం అనేక మంది అటు తహసీల్దార్‌, ఇటు పౌసరఫరాల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబంలో ఒకరు చనిపోయి ఉంటే వారి తొలగింపు, పుట్టిన వారి పేర్ల చేర్పు, కుటుంబంలో ఐదారుగురు గతంలో కలిసి ఉండి ఇప్పుడు విడిపోయి ఉంటే అటువంటి వారు కొత్త కార్డుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల పౌరసఫరాల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్త రేషన్‌కార్డులతోపాటు చేర్పులు, మార్పుల కోసం వస్తున్న అర్జీల విషయాన్ని జిల్లా అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆవిషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, త్వరలోనే ప్రకటన వస్తుందని ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం.

Updated Date - Feb 15 , 2025 | 11:30 PM