ఊరూవాడ పండుగ
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:35 AM
వరుసగా ఎనిమిదో నెల కూడా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శనివారం ఉత్సాహంగా సాగింది. అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం ఆరు గంటల నుంచే సచివాలయాల సిబ్బంది వారికి తోడుగా స్థానిక టీడీపీ నాయకులు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి లబ్ధిని అందజేశారు.
ఒక్కరోజే 90 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ
చిన్నఓబినేనిపల్లిలో పాల్గొన్న మంత్రి స్వామి
ఇతరచోట్ల ముఖ్యనేతలు, అధికారులు హాజరు
ఒంగోలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : వరుసగా ఎనిమిదో నెల కూడా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శనివారం ఉత్సాహంగా సాగింది. అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం ఆరు గంటల నుంచే సచివాలయాల సిబ్బంది వారికి తోడుగా స్థానిక టీడీపీ నాయకులు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి లబ్ధిని అందజేశారు. కార్యక్రమంలో పలుచోట్ల కీలక ప్రజాప్రతినిధులు ముఖ్యనాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 2.84 లక్షల మందికి రూ.123.31 కోట్లు మంజూరు కాగా శనివారం ఒక్కరోజే 90.36శాతం పంపిణీ చేశారు. అలా 2.57లక్షల మందికి రూ.110.99 కోట్ల మేర సాయంత్రం ఆరు గంటలలోపే అందజేశారు. మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి బేస్తవారపేట మండలంలోని చిన్న ఓబినేనిపల్లిలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులోని ధారావారితోటలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డినగర్‌లో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురం పట్టణంలోని 10వవార్డులో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పంపిణీ చేశారు. పెద్దారవీడు మండలం శివరాంపురంలో టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు, దర్శి మండలం లంకోజనపల్లిలో దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలు పింఛన్‌లు అందజేశారు. ఇతర చోట్ల స్థానిక టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.