వెలిగొండ.. మార్కాపురం జిల్లా
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:36 PM
దశాబ్దాల కలల పంట వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు.. పశ్చిమప్రాంత అభివృద్ధికి, ప్రజల భవిష్యత్‌కు భరోసా కలిగించనున్నాయి. అయితే వెలిగొండకు తాజా బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం, జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వపరంగా చర్యలు ప్రారంభించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.

ఆ రెండింటితోనే పశ్చిమప్రాంత అభివృద్ధికి భరోసా
ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోరుతున్న ప్రజానీకం
ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ, యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ నిర్మాణాలు, ఉపాధి ముఖ్యం
నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు
మహిళా దినోత్సవ సభకు హాజరు
కార్యకర్తలతో సమావేశం, అధికారులతో సమీక్ష
శాఖలవారీ పురోగతిపై సిద్ధమైన నివేదిక
దశాబ్దాల కలల పంట వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు.. పశ్చిమప్రాంత అభివృద్ధికి, ప్రజల భవిష్యత్‌కు భరోసా కలిగించనున్నాయి. అయితే వెలిగొండకు తాజా బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం, జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వపరంగా చర్యలు ప్రారంభించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర కీలక నేతలు ఆ రెండింటికీ కట్టుబడి ఉన్నట్లు పలుమార్లు ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదున్నర నెలల అనంతరం జిల్లాకు ప్రత్యేకించి మార్కాపురానికి వస్తున్న సీఎం నుంచి మరింత స్పష్టత కోసం ఆ ప్రాంత ప్రజానీకం ఎదురుచూస్తోంది.
ఒంగోలు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశ్చిమప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న సాగు, తాగునీటి ఇక్కట్లను తీర్చేది ఒక్క వెలిగొండ ప్రాజెక్టే అన్నది బహిరంగ సత్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కీలక దశకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయాలని ప్రజానీకం కోరుతోంది. సుమారు 53.58 టీఎంసీల సామర్థ్యం ఉండేలా రిజర్వాయర్‌ను నిర్మించి ప్రధానంగా జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాలతో కలిపి మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రతిపాదించిన ప్రాజెక్టుకు 1996 మార్చిలో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తర్వాత జలయజ్ఞంలో భాగంగా 2005లో పనులు ప్రారంభించారు. మూడేళ్లలో తొలిదశ పూర్తిచేసి లక్షా 10 వేల ఎకరాలకు, ఐదేళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తిచేసి మిగిలిన 3.28 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్నది లక్ష్యం. కాగా ఇంత వరకూ తొలిదశ కూడా పూర్తికాలేదు. కీలకమైన సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రతిబంధకంగా మారింది. ప్రాజెక్టును పూర్తిచేయకుండానే గత ఎన్నికలకు ముందు జగన్ జాతికి అంకితం పేరుతో పైలాన్ ఆవిష్కరించి ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఆ విషయం అలా ఉంచితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకతో వెలిగొండపై ప్రజల్లో ఆశలు పెరిగాయి.
భారీగా నిధులు అవసరం
తాజా అంచనాల ప్రకారం రూ.9,500 కోట్లకు ప్రాజెక్టు వ్యయం చేరుకొంది. ఇప్పటి వరకూ దాదాపు రూ. 6వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిలో తొలిదశ పూర్తికి రూ.1,400 కోట్లు, రెండో దశకు రూ.2,200 కోట్లు అవసరమని సమాచారం. మొత్తం నిధులలో రూ.1,300 కోట్ల వరకు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసానికి అవసరం. తొలిదశ పూర్తి చేసి 2026 జూన్‌కు నీరివ్వాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఆలోపు కనీసం రూ.800 కోట్లు నిర్వాసితులకు, మరో రూ.500 కోట్లు పనులకు అవసరం. అయితే తాజా బడ్జెట్‌లో రూ.309 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ పరిస్థితుల్లో నిధులు కేటాయింపు పెంచడంతోపాటు పెండింగ్ ఉన్న టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం ద్వారా వెలిగొండ నీటిని వచ్చే ఏడాది జూన్‌కు ఇచ్చేలా భరోసాను ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
జిల్లా ఏర్పాటు ప్రధానాంశం
మార్కాపురం జిల్లా ఏర్పాటు కూడా ప్రధానాంశంగా ప్రజల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలోనే మార్కాపురం ప్రాంత ప్రజలు జిల్లాకేంద్రమైన ఒంగోలుకు రావాలంటే అత్యధికులు 100 నుంచి 150 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చి అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజలు కోరినా పట్టించుకోలేదు. హేతుబద్ధత లేకుండా జిల్లాల విభజన చేశారు. ఆ సమయంలో ఉద్యమించిన పశ్చిమప్రాంత ప్రజలకు టీడీపీ భరోసా ఇచ్చింది. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన జిల్లాగా మారనుంది. వెలిగొండ పూర్తిచేస్తే సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. పలు జాతీయ రహదారులు, రెండు రైల్వేలైన్లు, పశ్చిమాన నల్లమల అడవి, అంతకు మించి విస్తారంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతోపాటు ప్రతిపాదిత దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్జ్, తాజాగా ప్రకటించిన రిలయన్స్ బయో విద్యుత్ ప్లాంట్ ఆ పరిధిలోకి వస్తాయి.
దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం..
ప్రస్తుతం జిల్లా మొత్తంగా ఉన్న పరిస్థితి, ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలను పరిశీలిస్తే జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీకి వైసీపీ ప్రభుత్వం సమాధి కట్టగా దానిని పునరుద్ధరించాలన్న డిమాండ్ పాడి రైతులలో ప్రధానంగా ఉంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై శంకుస్థాపన చేసిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీల నిర్మాణాల ఊసే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా వాటిని నిర్మించాలని ప్రజానీకం, విద్యార్థులు కోరుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశుసంపద రక్షణ కోసం ఏర్పాటు చేసిన చదలవాడ పశుక్షేత్రం అభివృద్ధి చేయాల్సి ఉంది. కనిగిరి నిమ్జ్, దొనకొండ కారిడార్‌లలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఇతర ఉపాధి మార్గాలను పెంపును ప్రజానీకం ఆశిస్తోంంది. శాశ్వతంగా తాగునీటి ఇక్కట్లు, సాగర్ ఆయకట్టులో నీటి సమస్య పరిష్కారంపై చర్యలను ప్రజలు కోరుతున్నారు.
గాడినపడని యంత్రాంగం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా జిల్లాలో యంత్రాంగం గాడిన పడలేదు. కలెక్టర్ తమీమ్ అన్సారియా తాను పనిచేస్తూ ఇతర శాఖల అధికారులను పరుగులెత్తిస్తున్నా ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. కీలకమైన సహకార సంస్థలు గాడితప్పాయి. ఆ శాఖ అధికారులు నేటికీ వైసీపీ అనూకూల చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ అధికారుల విషయంలోనూ, డ్వామాలో అడ్డగోలు దోపిడీకి బాధ్యుడైన పూర్వ పీడీపై చర్యల విషయంలోనూ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి జిల్లా ప్రజాప్రతినిధుల్లో ఉంది. ఇక జిల్లాలో వైద్య, విద్య, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీ, హౌసింగ్, జలవనరులు, స్త్రీ,శిశుసంక్షేమ శాఖలతోపాటు ప్రధానంగా రెవెన్యూ పనితీరు అధ్వానంగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలు ప్రకారం ఆయా శాఖలు లేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాకు వస్తున్న సీఎం కీలక అంశాలపై స్పష్టతతో ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు యంత్రాంగానికి తగు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి మార్కాపురం వేదికైంది. పట్టణ శివారులో సభ నిర్వహిస్తుండగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ, అధికారుల భేటీలోనూ పాల్గొంటారు. మొత్తం ఆరు గంటలపాటు అక్కడ సీఎం గడపనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఎస్పీ ఎఆర్.దామోదర్ నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కాగా సీఎం వస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగు, ఉపాధి అంశాలపై ఆయన స్పందించాలని ప్రజానీకం కోరుతోంది.. ప్రత్యేకించిన పర్యటన సాగనున్న పశ్చిమ ప్రజల్లో ఆ ప్రాంత అభివృద్ధి అంశాలపై భరోసా ఇవ్వాలన్న ఆకాంక్ష అధికంగా వినిపిస్తున్నది.