Share News

నిరుపయోగంగా ఎత్తిపోతల

ABN , Publish Date - Feb 16 , 2025 | 10:34 PM

సాగర్‌ ఆయకట్టు చివరలో ఉన్న భూములకు ఆరుతడి పంటలకు నీటి వసతి కల్పించాలన్న ఉన్నత ఆశయంతో 4 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం మూలనపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.70కోట్లు వెచ్చించి మరమ్మతులు పూర్తి చేసినా తర్వాత వచ్చిన వైసీపీ కనీసం నిర్వహణపై కూడా దృష్టి సారించకపోవడంతో మూలనపడింది.

నిరుపయోగంగా ఎత్తిపోతల
నిరుపయోగంగా ఉన్న శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం

శింగరకొండపాలెం పథకం వినియోగంలోకి వచ్చేదెప్పుడో

4 దశాబ్దాల కిందట నిర్మాణం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.70లక్షలతో మరమ్మతులు

వైసీపీ వచ్చాక నిర్వహణ గాలికి

కూటమి ప్రభుత్వంపై గంపెడు ఆశలతో రైతులు

అద్దంకి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ ఆయకట్టు చివరలో ఉన్న భూములకు ఆరుతడి పంటలకు నీటి వసతి కల్పించాలన్న ఉన్నత ఆశయంతో 4 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం మూలనపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.70కోట్లు వెచ్చించి మరమ్మతులు పూర్తి చేసినా తర్వాత వచ్చిన వైసీపీ కనీసం నిర్వహణపై కూడా దృష్టి సారించకపోవడంతో మూలనపడింది. టీడీపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు సాగునీటి వసతి పెంచాలన్న ఉద్దేశంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకా లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం వద్ద భవనాసి చెరువు నీరు ఆధారంగా 4 దశాబ్దాల క్రితం శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. సుమారు 3229 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే లక్ష్యంతో శింగరకొండపాలెం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేలల్లో సుమారు 2కి.మీ దూరం పైప్‌ లైన్‌లు వేసి అద్దంకి మేజర్‌లో నీరు పడే విధంగా ఏర్పాటు చేశారు. అద్దంకి మేజర్‌ లో చివరి ఆయకట్టుగా ఉన్న కలవకూరు, బొమ్మనంపాడు, శింగరకొండపాలెం, గోపాలపురం, ఉత్తర అద్దంకి, దక్షిణ అద్దంకి, వేలమూరిపాడు,నాగులపాడు తదితర గ్రామాల రైతుల పంట పొలాలకు నీరు అందేలా ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం పాటు పనిచేసిన ఎత్తిపోతల పథకం అనంతరం తరచూ మరమ్మతులకు గురవుతూ నిరుపయోగంగా మారింది. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు 70 లక్షల రూపాయలతో కొత్త విద్యుత్‌ మోటార్‌లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశారు. నీటి విడుదల జరిగింది. అయితే ఎత్తిపోతల పథకం నుంచి అద్దంకి మేజర్‌ కాలువ వరకు ఉన్న పైప్‌లైన్‌ లీకులు కావడంతో ఆశించిన ఫలితం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టక పోవడంతో 5 సంవత్సరాల పాటు పూర్తిగా మూలన పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో ఎత్తిపోతల పథకం వద్ద హడావుడి చేసిన వైసీపీ నేతలు ఆ తరువాత అటువైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో గత 5 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథకం తలుపులు కూడా తీసిన పాపానపోలేదు. దీంతో ఎత్తిపోతల పథకం మరలా అటకెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించడంతో రైతులలో ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటడంతో రైతులలో ఎదురు చూపులు మొదలయ్యాయి. భవనాసి చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకం ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో పునఃనిర్మాణం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎత్తిపోతల పథకం స్థాయిని పెంచి పమిడిపాడు మేజర్‌ వరకు పొడిగిస్తే అద్దంకి, పంగులూరు, కొరిశపాడు మండలాలలోని సాగర్‌ ఆయకట్టులో ఉన్న సుమారు 20 గ్రామాల పంట పొలాలకు నీటి వసతి పెరగడంతో పాటు ఆయా గ్రామాలకు మంచి నీటి వసతి మెరుగు పరిచే అవకాశం ఉంటుందని పలు గ్రామాల రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 10:34 PM